తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని రోజా హెచ్చరించారు. కనీసం అర కిలోమీటర్ సక్రమంగా నడవలేక, వంకర టింకరగా నడిచే నువ్వు కూడా 3600 కిలోమీటర్లు నడిచిన జగన్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సంక్షేమ పథకాలు ఇప్పుడు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, అభివృద్ధి కనిపిస్తోందన్నారు. అందుకే టీడీపీ ఈ మధ్య కొత్త రాగం అందుకున్నదని చెబుతున్నారన్నారు. మేం అధికారంలోకి వచ్చినా సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. దానికి ప్రజలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారని, జగన్ తెచ్చిన పథకాలు మీరు కంటిన్యూ చేయడం ఎందుకు… తెచ్చిన ఆయనే కంటిన్యూ చేస్తాడులే అంటూ కౌంటర్ ఇస్తున్నారన్నారు. టీడీపీ వారికి గ్రామాల్లో, వార్డుల్లో తిరిగే ధైర్యం లేదని, అందుకే కేవలం ప్రెస్ మీట్లు పెట్టి మాత్రమే వైసీపీ నేతల పైన ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీపై విమర్శలు చేస్తే, ఎన్నికల సమయంలోను టీడీపీ నేతలకు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏమీ చేయలేదని, ఇప్పుడు జగన్ మాత్రం ఎంతో చేస్తున్నారన్నారు.
వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలని లోకేష్ చేసిన కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వైసీపీ నేతలపై చీపుర్లు ఎందుకు వాడాలని ప్రశ్నించారు. మ్మఒడి, చేదోడు, ఆసరా వంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు… వైసీపీ నేతలపై చీపుర్లు ఉపయోగించాలా అని నిలదీశారు. ఆదర్శప్రాయమైన విద్యా విధానాలు , పథకాలు అమలు చేస్తున్నందుకు… చీపుర్లతో కొట్టాలా అని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలపై టీడీపీ వైఫల్యాలను బయటపెట్టినందుకాకు చీపుర్లతో కొట్టాలా అన్నారు. డ్వాక్రా రుణాల 24 వేల కోట్లు మాఫీ చేసినందుకు… కొట్టాలా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా తిరుగుబాటు జరగాల్సింది టీడీపీ పైన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీని కాదని… టీడీపీని చీపుర్లతో కొడతారన్నారు.