»Ttd Governing Bodys Key Decisions Good News For Them
TTD: పాలకమండలి కీలక నిర్ణయాలు..వారికి గుడ్ న్యూస్
టీటీడీ పాలక మండలి నేడు సమావేశమైంది. ఈ సందర్బంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నట్లు వెల్లడించింది. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానాన్ని ప్రకటించింది. అంతేకాకుండా మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) పాలకమండలి నేడు సమావేశం అయ్యింది. ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో టీటీడీ బోర్డు (TTD Board) సభ్యులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను (Contract Employees) క్రమబద్దీకరించనున్నట్లు తెలిపారు. 114 జీవో ప్రకారంగా అర్హులైనవారిని రెగ్యులరైజ్ చేయనున్నట్లు పాలకమండలి నిర్ణయించింది. ఇకపోతే టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంపై కూడా సమావేశంలో చర్చించారు. టీటీడీలోని శాశ్వత ఉద్యోగులకు రూ.14 వేలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.6,850 ఇవ్వనున్నట్లు పాలక మండలి తెలిపింది.
నవంబర్ 23వ తేదిన అలిపిరి గోశాల వద్ద శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించనున్నట్లు పాలక మండలి తెలిపింది. ఈ హోమం నిర్వహించేందుకు రూ.1000ల రుసుంగా టీటీడీ నిర్ణయించింది. అలాగే శాశ్వత ఉద్యోగులకు ఇంటి స్థలాలను కేటాయించే ప్రాంతాల పరిధిలో రోడ్ల నిర్మాణానికి రూ. 27.65 లక్షలను కేటాయించినట్లు తెలిపారు. రూ.15 కోట్లతో అదనంగా మరో రోడ్డు నిర్మించేందుకు అనుమతులిచ్చారు. ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చేందుకు టీటీడీ (TTD) నిర్ణయించింది. అందుకోసం స్థలాలను సేకరిస్తున్నట్లు తెలిపింది.
మంగళం ఆర్టీవో ఆఫీసు నుంచి తిరుచానూరు రోడ్డు అభివృద్ధికి రూ.15 కోట్లను టీటీడీ పాలక మండలి (Governing Council of TTD) కేటాయించింది. అలాగే ఆరోగ్య విభాగంలో 650 ఉద్యోగులను (650 Employees) ఇంకో ఏడాది పాటు పొడిగిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు స్విమ్స్ ఆస్పత్రికి సంబంధించి మరో నూతన భవనాన్ని (New Building) నిర్మించనున్నట్లు తెలిపింది.
తెలంగాణ (Telangana)లోని కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నిధులను కేటాయించింది. రూ.4.89 లక్షలతో పుదిపట్ల వకులమాత ఆలయాన్ని డెవలప్ చేయనుంది. అలాగే సంప్రదాయ కళలను, కలంకారీ, శిల్పకళ శిక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటి కోసం ఏడాది పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు టీటీడీ పాలక మండలి వెల్లడించింది. వకులమాత ఆలయం వద్ద రూ.21 కోట్లతో రోడ్డు మార్గాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు తిరుపతి పద్మావతి చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణానికి నూతన టీబీ వార్డు నిర్మాణానికి టీటీడీ బోర్డు (TTD Board) ఆమోదించింది.