»Tirumala Cheetah Stir Again On The Walkway Tension Among Devotees
Tirumala: నడకమార్గంలో మరోసారి చిరుత కలకలం..భక్తుల్లో టెన్షన్
తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో మరోసారి చిరుత కలకలం రేపింది. దీంతో భక్తుల్లో టెన్షన్ మొదలైంది. ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ కనిపించలేదని టీటీడీ అధికారులు చెబుతున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో చర్యలు చేపట్టామని, భక్తులను గుంపులు గుంపులుగా నడకమార్గంలో పంపుతున్నట్లు టీటీడీ వెల్లడించింది.
తిరుమల (Tirumala) నడకమార్గంలో మరోసారి చిరుత (Cheetah) కలకలం రేపింది. ఈమధ్య కాలంలో తిరుమలలో చిరుతల సంచారం అందర్నీ భయాందోళన కలిగించింది. నడక మార్గంలో చిరుత సంచారంతో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా తగ్గింది. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ నడక మార్గంలో ట్రాప్ కెమెరాలు, ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అలాగే నడిచి వెళ్లేవారికి చేతి కర్రలను కూడా టీటీడీ (TTD) అందిస్తూ వస్తోంది. అంతేకాకుండా మరిన్ని చర్యలు చేపట్టేందుకు కూడా ప్రణాళిక వేస్తోంది.
మొన్నటి వరకూ అలిపిరి మెట్ల మార్గంలో సంచరించిన చిరుతలు ఇప్పుడు శ్రీవారి మెట్టు (Srivari Mettu) మార్గంలో తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. తాజాగా నేడు తిరుమల శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఓ చిరుతను భక్తులు చూశారు. శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. చంద్రగిరి వద్ద నుంచి సాగే శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతను గమనించినట్లు పులివెందులకు చెందిన భక్తులు అధికారులకు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devastanams) సెక్యూరిటీ అధికారులకు చిరుత సంచారం సమాచారం అందింది. వెంటనే టీటీడీ (TTD) అధికారులు చిరుత ఎక్కడుందో గుర్తించేందుకు రంగంలోకి దిగారు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లేవారిని గుంపులుగా పంపిస్తున్నారు. చిరుత సంచారం వల్ల శ్రీవారి మెట్టు కింది భాగంలో ఉన్న వాటర్ హౌస్ వద్ద భక్తులను కొద్దిసేపు నిలిచి ఉంచారు. సెక్యూరిటీ అధికారులు భక్తులను గుంపులు గుంపులుగా పంపుతున్నారు.
భక్తులు భయాందోళన చెందొద్దని, చిరుత సంచారం లేకుండా చర్యలు చేపడుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గంలో పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేస్తున్నామని, భక్తులు ఆందోళన చెందొద్దని, దర్శనానికి వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని సూచించారు. ట్రాప్ కెమెరాల్లో చిరుత జాడ కనిపించలేదని, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.