నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ఉదయం 11.03 గంటలకు లక్ష్మీపురం నుంచి ప్రారంభమైంది. యాత్ర ఆరంభంలో బ్యానర్ల చించివేత అంశం ఉద్రిక్తతకు దారితీసింది. కుప్పం చెరువు కట్ట మీద కౌన్సిలర్ సురేష్ ఏర్పాటు చేసిన బ్యానర్లను కొందరు దుండగులు చించివేశారు. దీంతో టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. మరికొన్ని బ్యానర్లకు నిప్పు పెట్టారు. ఫ్లెక్సీలు చించివేత కుప్పంలో వివాదానికి దారి తీసింది. దీంతో లోకేష్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగినట్టు తెలుస్తోంది.
కుప్పంలో ప్రారంభమైన నారా లోకేశ్ పాదయాత్ర 400 రోజులపాటు కొనసాగుతుంది. 4 వేల కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర చేపడుతారు. శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో పాదయాత్ర ముగియనుంది. పాదయాత్ర తొలి రోజున టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సినీ నటుడు బాలకృష్ణ, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సినీ నటుడు తారకరత్న పాల్గొన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో యువగళం బహిరంగ సభలో నారా లోకేశ్ పాల్గొంటారు. సభకు 50 వేల మందికి పైగా టీడీపీ నేతలు వస్తారని చెబుతున్నారు. సభలో వేదికపై 400 మంది నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సభ అనంతరం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి శెట్టిపల్లె క్రాస్, బెగ్గిలిపల్లె క్రాస్ మీదుగా యాత్ర కొనసాగుతుంది. తొలిరోజు పాదయాత్ర 8.5 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కుప్పం నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర 3 రోజులు 29 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. కుప్పం తర్వాత పలమనేరు నియోజకవర్గంలో పాదయాత్ర సాగుతుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు సాగే పాదయాత్రలో ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు జరగనుంది. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహిస్తారు.