నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పం బహిరంగ సభలో టిడిపి ఏపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. యువత భవిష్యత్తు కోసమే లోకేష్ యువగళం అన్నారు. లోకేష్ దమ్మున్న మగాడు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు, యువత భవిష్యత్తును కాపాడేందుకు లోకేష్ తొలి అడుగు వేశారన్నారు. రాష్ట్ర చరిత్రలో ఈ రోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందన్నారు. అధికారం కోసమైతే లోకేష్ 400రోజులు 4వేల కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదన్నారు. ఆయన పుట్టినప్పటికే తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అని, తండ్రిచంద్రబాబు జాతీయ స్థాయిలో రాజకీయంలో చక్రం తిప్పిన మహానేత, ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. ఇలాంటి మహానేతల వారసుడిగా రోడ్డెక్కి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వైసీపీ పాలనలో ప్రజలు మోసపోతున్నారన్నారు. ప్రజలు అక్రమాలు, అన్యాయాలకు గురవుతున్నట్లు చెప్పారు. మహిళలకు రక్షణ లేదన్నారు. ఈ కారణంగా లోకేష్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
దేశంలో ఎన్నో పార్టీలు వచ్చాయి.. ఎందరో ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ సైకో జగన్ లా ఎవరు లేరని, రాష్ట్రం ఆయన చేతుల్లోకి వెళ్ళడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజల పట్ల శాపంగా మారిందన్నారు. మూడున్నర ఏళ్లలో సైకో పాలనలో రాష్ట్రంలో ఎవరూ ప్రశాంతంగా లేరన్నారు. ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు.
ఈ సైకో ప్రభుత్వం ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందోనని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇలాంటి సైకోకు సరైన మొగుడు లోకేషే అన్నారు. లోకేష్ దమ్మున్న మొనగాడని, అతనికి చేయని అవినీతిని కూడా అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు యువత కదం తొక్కాలన్నారు. నేడు ఐదు కోట్ల ప్రజలు ఒకవైపు, జగన్ ఒకవైపు ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకో గెలుస్తాడో, ఆంధ్రులు గెలుస్తారో ప్రజలే తేల్చుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి 160 స్థానాల్లో గెలిచి, చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు. పోలీసులతో పని లేకుండా మనమే సైనికులుగా క్రమశిక్షణతో అధికారంలోకి రావడానికి పాదయాత్రను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలునిచ్చారు. ఈ 400 రోజులు యువతే సైన్యమై క్రమశిక్షణతో పాదయాత్రను ముందుకు తీసుకెళ్లాలన్నారు. సైకో జగన్ పోవాలి…సైకిల్ రావాలి… అన్నారు.