KKD: వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 28 మంది మృతి చెందారని ఎస్పీ బిందుమాధవ్ ధ్రువీకరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరారీలో ఉన్న కేంద్రం నిర్వాహకులు అడబాల నాని, అర్జున్‌లను రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్లు తెలిపారు. లైసెన్సులతో పారిపోయేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నామని, వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వెల్లడించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్ గురువారం అమరావతిలో CM చంద్రబాబును కలిశారు. జిల్లాలోని గ్రంథాలయాల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రితో చర్చించారు. మండల కేంద్రాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, పోటీ పరీక్షల విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నూతన భవనాల నిర్మాణం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విన్నవించారు.
సత్యసాయి: కదిరిలో వెలసిన ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం సాయంత్రం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో వేద పండితులు శాస్త్రోక్తంగా వాహన సేవను నిర్వహించారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 13 వరకు 15 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగనున్నాయి.
GNTR: నగరపాలక సంస్థ పరిధిలో మీడియా డిస్‌ప్లే ఫీజులు చెల్లించని బోర్డులను తొలగించాలని కమిషనర్ మయూర్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో రూ. 7 కోట్లకు పైగా బకాయిలు ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిదారుల వివరాలను సేకరించి, బోర్డులను తొలగించేందుకు తక్షణమే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు.
NLR: ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు DEO బాలాజీరావు తెలిపారు. గురువారం కందుకూరు వచ్చిన ఆయన పక్కా ప్రణాళికతో లక్ష్యాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. డిసెంబర్ 6 తేదీ నుంచి 100 రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నామని తెలిపారు.
BPT: జిల్లాలో ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని గురువారం కలెక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో 3 వేల మందితో, ప్రతి నియోజకవర్గంలో 500 మందితో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వేడుకల్లో భాగంగా వివిధ శాఖల స్టాల్స్, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
GNTR: సచివాలయంలో గురువారం ‘ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్’ క్యాలెండర్, డైరీని మంత్రి సవిత ఆవిష్కరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు అందేలా చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని మాచవరం వద్ద గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చెందాడు. మృతుడు పిడుగురాళ్లకు చెందిన సాతులూరి రాంబాబు (45)గా స్థానికులు గుర్తించారు. ఈయన గత కొంతకాలంగా పచ్చాకు కూలీగా పనిచేస్తున్నాడు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు చేరుకొని మృతదేహాన ప్రభుత్వ వైద్యశాలను తరలించారు.
ప్రకాశం: వెలిగండ్ల మండలం మొగులూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పల్నాటి శ్రీనివాసులు రెడ్డి (60) అనే వృద్ధుడిపై అతని సొంత కుమారుడు భాస్కర్ రెడ్డి (ఆర్మీ జవాన్) విచక్షణ రహితంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసులు రెడ్డిని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆస్తి కోసమే భాస్కర్ రెడ్డి తండ్రిపై దాడి చేశాడు.
తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరగడానికి ఏర్పాట్లను సమీక్షించారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, విభాగాధికారి సమన్వయంతో వేడుకలు, హెల్త్ చెకప్ శిబిరాలు, మహిళల రక్షణ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.
PPM: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని గిరిజన జేఏసీ నాయకులు గురువారం పాచిపెంట మండలం పెద్దవలసలో ధర్నాను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. షెడ్యూల్ ప్రాంతంలో జాబితాను గిరిజన సంక్షేమ శాఖలో పొందుపరచమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తెలుపుతామని వారు హెచ్చరించారు.
VZM: బొబ్బిలి రాజుల ఇలవేల్పు శ్రీ వేణుగోపాలస్వామి వారికి ప్రతియేటా ఎంతో ఘనంగా నిర్వహించే డోలాయాత్రను గురువారం స్థానిక ఫూల్ బాగ్‌లో నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన ఈరోజు సాయంత్రం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.
NDL: కొలిమిగుండ్ల మండలం పెట్నికోట గ్రామ సమీపంలోని సుంకులమ్మ గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన బాల కంబయ్య బైకుపై కొలిమిగుండ్లకు బయల్దేరాడు. ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. బాల కంబయ్య తీవ్రంగా గాయపడటంతో 108లో తాడిపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి రిఫర్ చేశామని 108 సిబ్బంది తెలిపారు.
EG: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరంకి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వేగవంతమైన పర్యవేక్షణ క్షేత్రస్థాయికి కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతి పర్యవేక్షించడం సులభమవుతుంది.
VZM: చీపురుపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం సీఐ శంకర్రావు ,ఎస్సై దామోదర్ రావు నాగబంది నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రికార్డులు లేని వెహికల్స్‌ను సీజ్ చేశారు. ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీలో భాగంగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. అలాగే, మద్యం సేవించి వాహనం నడపరాదని అన్నారు.