ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. యువగళం పాదయాత్రలో జగన్ సర్కార్ చర్యలను ఎండగట్టారు. జగన్‌ను నమ్మి అధికారం అప్పగిస్తే.. మహిళల తాళిబొట్లు తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. మద్యపాన నిషేధం హామీతో అధికారం చేపట్టి, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి చేపట్టిన తర్వాత అధిక ధరలపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో మూడో రోజు యువగళం పాదయాత్ర ప్రారంభించిన తర్వాత మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. మూడున్నరేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు లోకేశ్‌కు వివరించారు.
అమ్మ ఒడి పేరుతో తమను జగన్ మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నుల భారం తగ్గిస్తే నిత్యావసర ధరలు తగ్గుతాయని లోకేశ్ అన్నారు. 45 ఏళ్ల మహిళలకు పింఛన్ ఇస్తాననే హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అమ్మ ఒడికి కోత పెట్టారని, ఆంక్షలతో లబ్ధిదారుల్ని కుదించారని ఆరోపించారు. దిశా చట్టంపై అసత్యాలు నమ్మబలికారని విమర్శించారు. పొదుపు సంఘాలను నిర్వీర్యం చేయటంతో స్వయం ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని డ్వాక్రా మహిళలు తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వమనడంతో నమ్మి చారిత్రక తప్పిదం చేశామని మహిళలు వాపోయారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాకుంటే తమ బిడ్డలకు భవిష్యత్ లేదనే విషయాన్ని మహిళలు అంటున్నారు. టీడీపీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. మహిళలకు చంద్రబాబు అందించిన చేయూతపై ఓ మహిళ పాటపాడారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థి దశ నుంచే మహిళల గొప్పతనం, త్యాగాలు, కష్టాలు తెలిసేలా పాఠ్యాంశాలు ప్రవేశపెడతామని నారా లోకేశ్ అన్నారు. మహిళలకు భద్రత, భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను, సమస్యలను లోకేశ్‌కు మహిళలు వివరించారు. అమ్మ ఒడి ఇచ్చామని పన్నులు విపరీతంగా పెంచారని తెలిపారు. సాకులు చెప్పి అమ్మ ఒడిలో డబ్బులు కట్ చేసి ఇస్తున్నారని, ఈ ఏడాది అమ్మ ఒడి పడలేదన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి అని భారతి రెడ్డి అన్నారు? ఇప్పుడు ఇస్తున్నారా..? అని ప్రశ్నించారు. అరకొరగా ఇచ్చే అమ్మ ఒడి ఏడాది ఎగొట్టారన్నారు. 45 ఏళ్లకే మహిళలకు పెన్షన్ అని ఇస్తున్నారా..? అని ఆయన ప్రశ్నించారు.