Jogi Ramesh says Amaravati remains legislative capital
ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న జగన్.. పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అనుకూలమైనదని, విశాఖ రాజధాని కాబోతుందని, త్వరలో తాను కూడా షిఫ్ట్ కానున్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రాజధాని మొత్తం అక్కడకు వెళ్తుందనే ప్రచారం సాగుతోంది. అలాగే, రాజధాని అంశం సుప్రీం కోర్టులో ఉన్న సమయంలో మాట్లాడటం ఏమిటనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ స్పందించారు. ముఖ్యమంత్రి కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. బురద చల్లడమే విపక్షాల పని అని విమర్శించారు.
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అన్ని ఆధారాలు దొరుకుతున్నాయని, అవినాష్ రెడ్డి వద్ద సీబీఐ కీలక ఆధారాలు సేకరించిందని, అందుకే ఈ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు జగన్ విశాఖ రాజధాని అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని టీడీపీ ఆరోపించింది. దీనిపై కూడా జోగి ఘాటుగా స్పందించారు. సీబీఐ కేసుకు, విశాఖ రాజధానికి సంబంధం ఏమిటో చెప్పాలన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే అభివృద్ధి వికేంద్రీకరణ అని వెల్లడించారు. త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని, అయితే శాసన రాజధాని అమరావతిలోనే ఉంటుందని స్పష్టం చేశారు.