జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఆపేందుకే వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1ను తీసుకు వచ్చిందని మెగా సోదరుడు నాగబాబు అన్నారు. రణస్థలంలో జరుగుతున్న జనసేన యువశక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారన్నారు. జనసేన ఓ కుటుంబ పార్టీ కాదని అందరి పార్టీ అని తెలిపారు. తాను పార్టీ అభివృద్ధికి మాత్రమే పని చేస్తానన్నారు. సామాన్య కార్యకర్త నుండి ఎవరైనా జనసేనలో సీఎం అయ్యే అవకాశముంటుందన్నారు నాగబాబు. వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో నియంతలా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో పవన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి వారాహి యాత్రను ఆపేందుకు ఏపీ ప్రభుత్వం కొత్త కొత్త జీవోలు తెస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో వైసీపీ పతనం ఖాయమన్నారు. జగన్ ఉన్నత విద్యావంతుడు కాదు. ఆయనకు తెలివి లేదు.. ఎదుటివాడు చెప్తే వినడు అని ఎద్దేవా చేశాడు. ఏపీలో ఇసుక మాఫియా పెరిగిపోయిందని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కూడా నిఘా పెడుతుందని విమర్శించారు. పోలీస్, సీఐడీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. యువత రాజకీయాలకు దూరంగా ఉంటే దుర్మార్గులు రాజ్యమేలుతారన్నారు. జనసేన యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలను చితక్కొట్టడమే తమ నైజంగా జగన్, వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారన్నారు. కాగా, శ్రీకాకుళంలో జరిగిన రణస్థలం యువశక్తి సభకు జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.