తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ (CI Anju Yadav) మరోసారి వార్తల్లో నిలిచారు. ఆందోళన చేస్తున్న జనసేన నాయకుడు చెంపలపై ఆమె కొట్టారు.శ్రీకాళహస్తి(Srikalahasti)లో జనసేన శ్రేణులు చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. తమ అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశిస్తూ సీఎం జగన్ (CM JAGAN) చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జనసైనికులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా సీఎం దిష్టిబొమ్మ దహనానికి వారు యత్నించారు. అయితే దిష్టిబొమ్మ దహనానికి తాము అనుమతించబోమని సీఐ వారికి తెలిపారు. అయినప్పటికీ వారు దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో జనసేన నేత (Janasena leader) రెండు చెంపలపై కొట్టారు.
ఈ ఘటనతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ నిరసన కార్యక్రమానికి యత్నించడంతో పలువురు నేతలను శ్రీకాళహస్తి పోలీసులు హౌస్ అరెస్ట్ (House arrest) చేశారు. కొంతమంది జనసేన నేతలు పోలీసుల కళ్లుగప్పి పెళ్లిమండపం కూడలి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ విరుచుపడ్డారు. సీఐ దురుసు ప్రవర్తనను వీడియో తీస్తున్న వ్యక్తిపైనా ఆమె దాడికి పాల్పడ్డారు. ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. సీఐ ప్రవర్తన చర్చనీయాంశమైంది. జనసేన నేతపై సీఐ దాడి చేసిన వీడియో వైరల్ (video viral) అవుతోంది. సీఐ తీరుపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.