బెంగళూరు(Bangalore)లో దారుణం చోటుచేసుకుంది. ఓ కంపెనీ ఎండీ, సీఈవోను హత్య చేసిన ఆపై ఇన్‌స్టాలో పోస్టులు చేశారు.ఆ కంపెనీని వీడి కొత్త కంపెనీ పెట్టిన మాజీ ఉద్యోగులే ఈ హత్య (murder) చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తమ నూతన కంపెనీ కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొంటున్నారనే అక్కసుతోనే వారిని చంపినట్లు అంగీకరించారు. నగరంలోని అమృతహళ్లి పంపా లేఅవుట్లోని ‘ఎయిర్ ఆన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ సీఈఓ వినుకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రహ్మణ్య (Director Phanindra Subrahmanyam) హత్యకు గురయ్యారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను శబరీష్, వినయ్‌రెడ్డి, సంతోష్‌గా గుర్తించారు. నిందితులంతా ఎయిర్ ఆన్‌లో మాజీ ఉద్యోగులు కావడం గమనార్హం.మృతులు ఫణీంద్ర, వినుకుమార్(Vinukumar)ల కంపెనీ ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది. ఆ కంపెనీలోనే నిందితులు గతంలో పనిచేశారు. ఆ తర్వాత వారు సదరు కంపెనీకి రిజైన్ చేసి సొంతంగా మరో సంస్థను ఏర్పాటు చేసుకొన్నారు.
నిందితుల్లో శబరీష్ తన పేరును జాక్ ఫిలిక్స్గా చెప్పుకొనేవాడు. శబరీష్ (Sabreesh) కొత్త కంపెనీలోని పలు లోపాలపై ఫణీంద్ర మాట్లాడేవాడు. దీంతో పాటు వారి కస్టమర్లను, ఉద్యోగులను లాక్కొనేందుకు యత్నించాడని ఫణీంద్రపై కక్ష పెంచుకొన్నాడు శబరీష్. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద కత్తి తీసుకొని ఫణీంద్రను అతడి కంపెనీలోనే హత్య చేశాడు. అరుపులు వినిపించడంతో వినుకుమార్ అక్కడికి చేరుకొన్నాడు. దీంతో శబరీష్ అతడిపై కూడా దాడి చేసి హతమార్చాడు. ఈ హత్యతో సంబంధం ఉన్న మరో ఇద్దరు ఉద్యోగులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. జాక్ ఫిలిక్స్ (Jack Felix) సామాజిక మాధ్యమాల్లో తనను తాను కన్నడ ర్యాపర్‌గా చెప్పుకొన్నాడు. అతడికి దాదాపు 16 వేల మంది ఫాలోవర్లున్నారు. ఈ జంట హత్యల తర్వాత ఇన్‌స్టా(Insta)లో పోస్టులు చేయడంలో బిజీగా గడిపాడు. హత్యల్లో తన ప్రమేయంపై వచ్చిన టీవీ వార్త స్క్రీన్ షాట్‌ను కూడా పోస్టు చేశాడు. ఈ హత్యకు ముందు కూడా ‘‘ఈ ప్రపంచం మొత్తం మోసగాళ్లు, కపట పొగడ్తలు చేసేవారితో నిండిపోయింది. నేను ఈ భూమిపై వారిని శిక్షిస్తాను. మంచి వారిని ఎప్పుడూ ఏమీచేయను’’ అని తెలిపాడు. దీంతో ఈ పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి.