వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో గెలుస్తుందని సీఎం జగన్ అన్న సంగతి తెలిసిందే. ఓటమి భయం కారణంగానే ఇలా అంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Chandrababu: ఒకచోట దోపిడీ చేసి ఆ పాపాన్ని మరోచోట అంటగడతారా? ఒక నియోజకవర్గంలో చెల్లని కాసు మరో నియోజకవర్గంలో చెల్లుతుందా? ఎమ్మెల్యేలు, మంత్రులకు బదిలీలు ఉంటాయని ఎప్పుడూ వినలేదని చంద్రబాబు వైసీపీ పార్టీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత వ్యతిరేకం ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకు చూడలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ప్రజలే ఎదురు చూసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తామన్న జగన్కు ప్రస్తుతం ఓటమి భయం పట్టుకుందని చంద్రబాబు అన్నారు. అందుకే 11 మంది ఎమ్మెల్యేలను మార్చి ఇంకో చోట ఇన్ఛార్జీలుగా నియమించారని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ పునాదులు లేని పార్టీ. ఎప్పుడు కూలిపోతుందో చెప్పలేమన్నారు. వైసీపీ పార్టీ నీటిలో మునిగే పడవలాంటిదని ఎద్దేవా చేశారు. అందుకే చాలా మంది ఆ పడవ నుంచి దూకేయాలని భావిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఎన్నో ఆరాచకాలు చేసిన వైసీపీ పార్టీని ప్రజలు క్షమించరని.. ఇక ఆ పార్టీ శాశ్వతంగా మునిగిపోతుందని చెప్పారు.
పులివెందులలో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిని ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లపై కేసులు పెట్టి భయభ్రాంతుల్ని చేస్తున్నారని బాబు పేర్కొన్నారు. ఈసారైనా ప్రభుత్వం మారకపోతే ఆంధ్రపదేశ్ భవిష్యత్తుపై ఆశలు వదులుకోవాల్సిందేనని ప్రస్తావించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని అడిగారని అంగన్వాడీలకు నోటీసులు ఇచ్చి ఉద్యోగాల నుంచి తీసేస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అంగన్వాడీ జీతాలను రూ.10వేలకు టీడీపీ పెంచిందని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు న్యాయం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.