ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులకు ఒక తీగా దొరికినట్లుగా తెలుస్తుంది. అది తాడేపల్లికి కనెక్ట్ అయినట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగు చూసినట్లుగా తెలుస్తోంది. వీటి ఆధారంగా కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. శనివారం సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. 2019 మార్చి 15న పులివెందులలోని ఇంట్లో దారుణ హత్యకు గురయ్యారు వివేకానంద. నాడు ఏం జరిగింది, రక్తపు మరకలు ఎందుకు చెరిపారు, గుండెపోటు కట్టుకథ కారణం ఏమిటి అనే అంశాలపై అవినాష్ రెడ్డిని ప్రశ్నించారని తెలుస్తోంది. ఇలాంటి అనేక అంశాలపై అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించినట్లు తెలిసింది. విచారణలో అతని కాల్ డేటా అత్యంత కీలకంగా మారింది.
వివేకా హత్య జరిగిన సమయంలో రెండు నంబర్లకు అవినాష్ నుండి ఎక్కువ కాల్స్ వెళ్లాయి. ఆ నంబర్లు ఎవరివో సీబీఐ ఆరా తీసే ప్రయత్నం చేసింది. ఈ నంబర్ నవీన్ అనే వ్యక్తిగా గుర్తించి, అతనికి నోటీసులు ఇచ్చింది. నవీన్ ఓ అతి కీలక వ్యక్తికి పీఏగా ఉన్నారు. రెండో నెంబర్ పైన కూడా ఆరా తీసింది. అవసరమైతే మరోసారి అవినాష్ రెడ్డిని పిలువనున్నారు.