నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పలమనేరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. బైరెడ్డిపల్లిలో కురుబ సామాజిక వర్గం ప్రతినిధులతో సమావేశం అయ్యారు. జగన్ పాలనలో సమస్యలు ఎదుర్కొంటున్నామని వివరించారు. బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం 1983లో టీడీపీ గెలిచిన తరువాత వచ్చిందని నారా లోకేశ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీ. కురుబ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కూడా తమ పార్టీయేనని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో 90 శాతం సబ్సిడీతో రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చాం. మినీ గోకులం నిర్మించింది టీడీపీ’ అని లోకేశ్ వివరించారు. రిజర్వేషన్లు తొలగించి, కురుబల గొంతును జగన్ కోశాడని విమర్శించారు.
కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లను ఏర్పాటు చేశారని, కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని లోకేశ్ అన్నారు. 3 ఏళ్ల 8 నెలల్లో కురుబలకి ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ ఇస్తే జగన్… కురుబలకి చేసింది ఏంటి? అని నిలదీశారు. రిజర్వేషన్లు తగ్గించాం అని బీసీ శాఖ మంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నారు. 16 వేల పదవులు పోలేదు అంటున్నారు. ఎన్ని పదవులు పోయాయో ఆయనే చెప్పాలి. కురుబలపై జగన్ పాలనలో దాడులు పెరిగాయని తెలిపారు.
జగన్‌లా దొంగ హామీలు ఇవ్వనని… నెరవేర్చే హామీలే ఇస్తాని నారా లోకేశ్ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బీరప్ప ఆలయం అభివృద్ది, నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్ధిక సహాయం చేస్తామని స్పష్టం చేశారు. ఉపాధి హామీ అనుసంధానం ద్వారా మినీ గోకులంలు నిర్మిస్తామని తెలిపారు.