బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రి వద్దకు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. శుక్రవారం కుప్పంలో నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రారంభించగా ఆ పాదయాత్రలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న నారా లోకేష్ తో కలిసి నడుస్తుండగా మొదటి రోజే హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. దీంతో కార్యకర్తలు హుటాహుటిన ఆయన్ని కుప్పంలోని ఓ హాస్పిటల్ కి తరలించారు.
తారకరత్నకు కుప్పం ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అయితే తారకరత్న గుండెపోటుతో పడిపోయారని తెలియడంతో బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి హుటాహుటిన తరలించారు. ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్ లో తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శనివారం ఆస్పత్రి వైద్యులు తారకరత్న ఆరోగ్యంపై ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. ప్రస్తుతం తారకరత్న పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, ఐసియూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే చంద్రబాబు, బాలకృష్ణ, పురందేశ్వరి, నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు హాస్పిటల్ కి ఒక్కొక్కరే చేరుకుంటున్నారు. తారకరత్న భార్య, కూతురు కూడా బెంగళూరు హాస్పిటల్ లోనే ఉన్నారు.
ఆదివారం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి తారకరత్నని చూసేందుకు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కూడా వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ లు బెంగళూరుకి వెళ్లి అక్కడి నుంచి హాస్పిటల్ కి చేరుకుంటారు. అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అంతా తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ, పలువురు టీడీపీ నాయకులు హాస్పిటల్ లో ఉండి తారకరత్న పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. తారకరత్న కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.