రష్యా విమానం కుప్పకూలడంతో అందులో ఉన్న ఉక్రెయిన్ సైనికులు 65 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాద ఘటనపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సైనికులపై రష్యా ప్రతీకార చర్యలు చేపడుతోందని ఫైర్ అయ్యింది.
రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆ దేశాల సరిహద్దుల్లో రష్యాకు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. చనిపోయిన వారిలో ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు కూడా ప్రయాణిస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ సమీపంలోని బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక విమానం కుప్పకూలిందని, అయితే ఆ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. బుధవారం విమానం కుప్పకూలినట్లు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఎవరైనా బతికి బయటపడ్డారనే విషయం కూడా తమకు తెలియలేదని రష్యా ప్రకటించింది.
విమానం కూలిపోవడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారని, ప్రత్యేక సైనిక మిషన్ విమానం ఘటనా స్థలానికి బయల్దేరిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మరణించడం పట్ల ఉక్రెయిన్ సైన్యం విచారం వ్యక్తం చేసింది. అది రష్యా పనే అయ్యుంటుందని అనుమానం వ్యక్తం చేసింది. రష్యా తమ ఆర్మీపై, సైనికులపై ప్రతికార చర్యలు చేపడుతోందని ఉక్రెయిన్ సైనికులు అనుమానం వ్యక్తం చేశారు.