బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారుతుందని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా ఏపీలో 2 రోజులు చిరు జల్లులు పడనున్నాయి. ఇన్నాళ్లు చలి పులి భయపెట్టింది. కాగా త్వరలో చల్లని జల్లులు పలకరించబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదే ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా మూడు రోజులపాటు నెమ్మదిగా పయనించనుంది. దీని ప్రభావంతో ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై దీని ఎఫెక్ట్ ఉండకపోవచ్చని వెల్లడించింది. మాములుగా జనవరి తొలి వారం తర్వాత.. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం చాలా అరుదు. రానున్న రెండు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది