యువగళం పాదయాత్రలో నారాలోకేశ్ చేతికి గాయం అయ్యింది. ప్రస్తుతం ఐస్ క్యూబ్స్‌తో ఆయన తన చేతిని మర్దన చేసుకుంటున్నారు. చేతికి గాయం అయినప్పటికీ ఆయన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుడిచేతికి స్వల్పంగా గాయం అయ్యింది. ‘యువగళం పాద్రయాత్ర’ను కొనసాగిస్తున్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేశ్ చేతిని బలంగా నొక్కడంతో గాయమైనట్లు తెలుస్తోంది. చీలమండ నరంపై ఒత్తిడి పడడంతో స్వల్పంగా వాపు వచ్చిందని, ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని టీడీపీ వర్గాల సమాచారం. యువగళం పాదయాత్ర పరవాడ మండలంలోకి ప్రవేశించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
చేతికి గాయం అయినా కూడా నారా లోకేశ్ పాదయాత్రను యథావిథిగా కొనసాగించారు. గాయానికి ఐస్ ముక్కలతో మర్దన చేస్తూ ముందుకు వెళ్లారు. అయితే అభిమానులతో కరచాలనానికి ఎడమ చేతిని వాడారు. కాగా యువగళం పాదయాత్ర 225వ రోజు తోటాడ స్మార్ట్ సిటీ నుంచి ప్రారంభమైంది. భరణికం గ్రామం వద్ద పాదయాత్ర పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున నారా లోకేశ్‌కు స్వాగతం పలికారు.