హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతి కుమారి హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకితభావం కనబరిచారని అన్నారు. ఆ రాజ్యాంగం ప్రకారంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని తెలిపారు.
శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందన్నారు. హైదరాబాద్ నగరం ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ పూర్తి సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని, నేషనల్ బిల్డింగ్‌ను అభివృద్ధి అంటారని తమిళిసై గుర్తు చేశారు. ఫామ్ హౌస్‌లు కట్టడం, మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదని పరోక్షంగా కేసీఆర్ పై చురకలంటించారు. కొంతమందికి తాను నచ్చకపోవచ్చు కానీ, తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపారు.