»Ap Districts Submerged In Water After 20 Years The Danger Warning Was Issued
Andhrapradesh: నీటమునిగిన ఏపీ జిల్లాలు.. 20 ఏళ్ల తర్వాత ఆ ప్రమాద హెచ్చరిక జారీ
ఆంధ్రప్రదేశ్‌లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలు పూర్తిగా జలమయం అయ్యాయి. నిజాంపట్నం వద్ద 20 ఏళ్ల తర్వాత 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు.
మిచౌంగ్ తుఫాన్ (Michaung Cyclone) ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని పలు జిల్లాలు నీట మునిగాయి. ఈ తుఫాన్ మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ వల్ల ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావం ఎక్కువగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోనే ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు.
#WATCH | Andhra Pradesh | As Severe Cyclonic Storm Michaung is likely to make landfall today on the southern coast of the state between Nellore and Machilipatnam, close to Bapatla, moderate rainfall with gusty winds is being experienced in Bapatla. pic.twitter.com/3y4Zi6oOv7
ఈ మిచౌంగ్ తుఫాన్ ఆదివారం బాపట్ల తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. మిచౌంగ్ తుఫాన్ వల్ల పెను ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయం అయినట్లు అధికారులు తెలిపారు. తుఫాన్ ప్రభావం వల్ల నిజాంపట్నం హార్బర్ లోనే 10వ నెంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సాధారణంగా అతి భారీ గాలులు, భారీ వర్షం ఉంటేనే ఈ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
నిజాంపట్నం తీర ప్రాంతానికి తుఫాను తాకే ప్రమాదం ఉందని, అధికారులు పదో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గత 20 ఏళ్లలో నిజాంపట్నం హార్బర్లో 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీచేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. మరోవైపు తీర ప్రాాంత గ్రామాలు ముప్పుకి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ తుఫాన్ ప్రభావం ఈ నెల 10వ తేది వరకూ ఉందని, వర్షాలు తగ్గుముఖం పట్టేంత వరకూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాల వల్ల విద్యుత్‌కు అంతరాయం కలిగే అవకాశం ఉందని, అవసరం అయితే తప్పా ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా మరోవైపు తిరుమల రాకపోకలను కూడా రద్దు చేశారు.