Andhra Pradesh: ఎన్నికల పోలింగ్ రోజు ఏపీలో మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. మూడు రోజుల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం నిన్నటివరకు దర్యాప్తు కొనసాగించింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ అధికారులు తెలిపారు. దీనిపై రెండు రోజుల పాటు సిట్ అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి విచారణ జరిపించారు.
రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన 150 పేజీల నివేదికలో పలు కీలకాంశాలను పొందుపరిచారు. ఈ ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్లతో పాటు స్థానికులు, పోలీసులను విచారించి మూడు జిల్లాల్లో దాదాపు 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు తేల్చారు. ఎఫ్ఐఆర్లో కొత్త సెక్షన్లు చేర్చే అంశంపైనా సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలా? వద్దా అనే అంశంపైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
హింస జరుగుతుందని తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా సిట్ నిర్థారించింది. ఈ ఘటనలో కొందరు పోలీసు అధికారుపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ ఘటనల్లో ఉపయోగించిన రాళ్లు, కర్రలు, రాడ్లు వంటి సామగ్రికి సంబంధించిన ఆధారాలూ సేకరించిన సిట్.. ఈ ఘటనలతో సంబంధం ఉన్న పలువురు రాజకీయ నేతల్ని సైతం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలపై పూర్తి నివేదికను ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని సిట్ కోరే అవకాశం ఉంది.