Soumya Vishwanathan: జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నిందితులకు ఢిల్లీ సాకేత్ కోర్టు శిక్షను ఖరారు చేసింది. నలుగురు దోషులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు రవికపూర్, అమిత్ శుక్లా, బల్బీర్ మాలిక్, అజయ్ కుమార్‌లను దోషులుగా నిర్ధారించిన కోర్టు ఈరోజు శిక్ష ఖరారు చేసింది. శుక్రవారం నాటి విచారణ సందర్భంగా శిక్షపై నిర్ణయాన్ని కోర్టు రిజర్వ్ చేసింది. సౌమ్య విశ్వనాథన్ 30 డిసెంబర్ 2008న ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్‌లో హత్యకు గురయ్యారు. సౌమ్య నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వస్తుండగా దుండగులు ఈ ఘటనకు పాల్పడ్డారు.
సౌమ్య హత్య వెనుక దోపిడీయే కారణమని పోలీసులు తమ చార్జిషీట్లో పేర్కొన్నారు. హత్య కేసులో నిందితులందరూ కోర్టు ఆదేశాల మేరకు 2009 మార్చి నుంచి జైలులో ఉన్నారు. నిందితులందరిపై పోలీసులు ఎంసీఓసీఏ కింద కేసు నమోదు చేశారు. ఘటన సమయంలో వీరంతా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. విశ్వనాథన్ ఒంటరిగా డ్రైవింగ్ చేయడం చూసిన వెంటనే కారును వెంబడించారు. కారు ఆపేందుకు సౌమ్య ప్రయత్నించగా కారు ఆగకపోవడంతో రవికపూర్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ నేరుగా సౌమ్య శరీరంలోకి చొచ్చుకుపోయింది. సౌమ్యపై కాల్పులు జరపడంతో అందరూ పరుగులు తీశారు. దీని తర్వాత, మరోసారి చూసేందుకు అందరూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించిన పోలీసులు కొన్ని నెలల తర్వాత వారిని పట్టుకున్నారు.