Arvind Kejriwal : లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎంకు ఈడీ నోటీసులు
మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. నవంబర్ 2న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని తెలిపింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు(Supreme Court)లో తిరస్కరణకు గురైన గంటల వ్యవధిలోనే ఈ సమన్లు జారీ చేసింది గతేడాది ఏప్రిల్‌లో ఇదే విషయంపై సీబీఐ కూడా కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది. అయితే గతేడాదే దాఖలు చేసిన ఛార్జిషీట్లో కేజ్రీవాల్‌ను నిందితుడిగా పేర్కొనలేదు.
కేజ్రీవాల్(Kejriwal)కు నోటీసులు జారీ చేయడంపై ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ కేంద్రం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆప్ పార్టీని నాశనం చేయాలనేది కేంద్ర ప్రభుత్వ ఏకైక లక్ష్యమని విమర్శించారు. ఇందుకోసం ఫేక్ కేసు సృష్టించడం సహా సాధ్యమైనవన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)ని నాశనం చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉందని దుయ్యబట్టారు. కాగా కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ఢిల్లీ బీజేపీ (BJP) నేతలు డిమాండ్ చేశారు. దిల్లీ మద్యం విధానం 2021-22ని(ప్రస్తుతం రద్దైంది) రూపొందించే క్రమంలో, అమలు సమయంలో ముఖ్యమంత్రిగా, ఆప్ అధినేతగా కేజ్రీవాల్‌ను నిందితులు సంప్రదించారని ఛార్జిషీటు(Charge sheet)లో ఈడీ పేర్కొంది. మద్యం డీలర్లకు భారీ ప్రయోజనం కలిగించేలా ఈ విధానాన్ని రూపొందించారని, ప్రతిగా వారి నుంచి కమీషన్లు పొందారని దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.