కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేసీఆర్‌పై సవాల్ విసిరారు.
DK Sivakumar: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వాళ్లపై సవాల్ విసిరారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలను నెరవేర్చానో లేదో తెలుసుకోవాలంటే కర్ణాటకకు వచ్చి చూడండని, వారు వస్తా అంటే తానే అక్కడి నుంచి బస్సు ఏర్పాటు చేస్తానన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు తాము ఐదు హామీలు ఇచ్చామని, ఇక్కడికి వస్తే ఆ హామీలు అమలు అవుతున్నాయో లేదో చూపిస్తామని అన్నారు. కర్ణాటకలో ప్రతి ఇంటికి వెళ్లి.. తామిచ్చిన గ్యారెంటీ స్కీమ్స్ అమలు అవుతున్నాయో లేదో చూద్దామని చెప్పారు. వారు వస్తామంటే వారు చెప్పిన టైమ్‌కే బస్సు పంపిస్తానని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే అన్ని వర్గాలు పవర్లోకి రావడమే అని డీకే అన్నారు. కేసీఆర్ పదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చారు. ఇచ్చిన హామీలన్ని పదేళ్లలో నెరవేర్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చినప్పుడు సోనియా గాంధీ అధికారం కోసం చూడలేదని అన్నారు. రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కొంచెం కృతజ్ఞత చూపాలని డీకే అన్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని డీకే తెలిపారు.