Congress Second Phase Bus Tour: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నేతల జంపింగ్ జపాంగ్‌లు కొనసాగుతున్నాయి. 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేసింది. ఇప్పటికే మొదటి విడత బస్సు యాత్రకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక రెండో విడత టూర్ ఖరారయ్యింది. రేపటి నుంచి ఆరు రోజుల పాటు.. ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల గుండా బస్సుయాత్ర (bus yatra) జరగనుంది.
తొలి రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో గల తాండూరు, పరిగి, చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరుగుతుంది. రేపు కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పాల్గొంటారు. రెండో రోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో గల సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొంటారు.
మూడో రోజు భువనగరి పార్లమెంట్ పరిధిలో గల జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో.. నాలుగో రోజు నల్గొండ, నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో గల నాగార్జున సాగర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో.. ఐదో రోజు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలో గల జడ్చర్ల, షాద్ నగర్ నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఆరో రోజు మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో గల మేడ్చల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ఉంటుంది. ఆ రోజుల్లో వీలును బట్టి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారు.
కాంగ్రెస్ బస్సుయాత్రలతో ఆ పార్టీకి బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది. శ్రేణులు మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. జనాల్లోకి కూడా తమ పార్టీ పట్ల పాజిటివ్ వెళుతుందని.. ఈ సారి తమదే విజయం అని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.