తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అన్నారు. నిన్న సంగారెడ్డి(Sangareddy)లో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో ఆయన మాట్లాడారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని అన్నారు. ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో తన నోరు, చేతులు కట్టేశారని లేకపోతే మరిన్ని విషయాలను పంచుకునే వాడినని తెలిపారు. వచ్చే పదేళ్లలో తాను ముఖ్యమంత్రిని కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తాను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తినని తెలిపారు. కార్యకర్తలకు కష్టం వచ్చిందని తెలిస్తే అక్కడ వాలిపోతానన్న జగ్గారెడ్డి అన్నారు.. ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ తనపై ఉండాలని కోరుకున్నారు.
కాంగ్రెస్(Congress)లో ఇప్పటికే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. దాదాపు సీనియర్ నేతలందరూ సీఎం అభ్యర్థి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ గెలిస్తే తామే సీఎం అభ్యర్థి అంటూ ముఖ్యనేతలందరూ ప్రకటించుకుంటున్నారు. కాంగ్రెస్ గెలిస్తే తానే సీఎం అవుతానంటూ ఇటీవల మాజీ మంత్రి జానారెడ్డి (Janareddy) వ్యాఖ్యానించారు. సీఎం పదవి చేపట్టే అవకాశం వస్తే వదులుకోనని, పార్టీకి ఎన్నో సేవలు అందించానని అన్నారు. తాను సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి తెలిపారు. జానారెడ్డి వ్యాఖ్యలు పార్టీలో సంచలనం రేపిన క్రమంలో.. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా అదే బాటలో నడవడం గమనార్హం.