ఎక్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వికీపీడియాకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వికీపీడియా తన పేరును మార్చుకుంటే ఆ సంస్థకు 1 బిలియన్ డాలర్లను ఇస్తానని తెలిపారు. వికీపీడియా (Wikipedia) తన పేరును డికీపీడియాగా మార్చుకోవాలని అని మస్క్ ట్వీట్ చేశారు. గురకపెడుతున్న ఎమోజీని షేర్ చేశారు. అలాగే వికీపీడియా ఎందుకు డబ్బులు అడుగుతోందని ప్రశ్నించారు. ‘వికీమీడియా ఫౌండేషన్( Wikimedia Foundation)కు అంతడబ్బు అవసరం ఏముందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..?
వికీ నిర్వహణకు అంతడబ్బు అవసరం లేదు. మరి దేనికోసం ఆ సొమ్ము అడుగుతున్నారు..?’ అని మస్క్ ప్రశ్నించారు.ఈ పోస్టుపై నెటిజన్లు (Netizens) భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొంతమంది ‘ఆ పైసలు అందిన వెంటనే తిరిగి పేరు మార్చుకోవచ్చు కదా..?’ అని సలహా ఇచ్చారు. దానికి మస్క్ బదులిస్తూ.. నేనేమైనా ఫూల్నా.. కనీసం ఒక ఏడాది ఆ పేరు ఉండాలి’ అని చెప్పారు. వికీపీడియాలో కచ్చితత్వం ఉండాలనే తాను ఈ ఆఫర్ చేస్తున్నానని అన్నారు. మస్క్ వ్యాఖ్యలపై వికీపీడియా ఇంకా స్పందించలేదు.