అనిల్ రావిపూడి, బాలయ్య కాంబోలో నేడు(అక్టోబర్ 19న) దసరా కానుకగా విడుదలైన చిత్రం భగవంత్ కేసరి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూద్దాం.
నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం భగవంత్ కేసరి(Bhagvanth Kesari Movie Review). ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా, శ్రీలీల ప్రముఖ పాత్ర పోషించింది. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా మరి ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
కథ
అవినీతికి పాల్పడే లీడర్‌కు ఎదురు తిరిగినందుకు నేలకొండ భగవంత్ కేసరిని(బాలయ్య) జైలుకు పంపిస్తారు. అక్కడ ఉండే జైలర్(శరత్ కుమార్) కేసరితో స్నేహం చేస్తాడు. కానీ ఆ తర్వాత జైలర్ చనిపోతూ తన కూతురు విజయలక్ష్మిని(శ్రీలీల) ఆర్మీలో జాయిన్ చేయమని కోరుతాడు. దీంతో కేసరి విజ్జికి కేర్ టేకర్‌గా మారుతాడు. విలన్ రాహుల్ సంఘ్వీ(అర్జున్ రాంపాల్) ఒక వ్యాపారవేత్త. ప్రభుత్వంతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తుంటాడు. దీనిని బయటపెట్టడానికి ప్రయత్నించిన డిప్యూటీ సీఏం(శుభలేఖ సుధాకర్)ను చంపి అతని పీఏ దగ్గర ఉన్న ఆధారాల కోసం వెంటపడుతుంటాడు. ఈ క్రమంలో విజ్జి(శ్రీలీల)ను చంపేందుకు సంఘ్వీ(అర్జున్ రాంపాల్) ప్రయత్నించడంతో కేసరి రంగంలో దిగుతాడు. సంఘ్వీతో పాత బాకీకి కొత్త బాకీ కలిపి తీర్చేస్తానని కేసరి అంటాడు. కేసరికి సంఘ్వీతో ఉన్న పగ ఏంటి? కేసరి జైలుకు ఎందుకు వెళ్లాడు? విజ్జి మిలిటరీలో జాయిన్ అయ్యిందా? విజ్జిని రక్షించుకోవడానికి కేసరి ఏం చేశాడు? సైకాలజిస్ట్ కాత్యాయని ప్రేమ ఎలా మొదలవుతుంది? సంఘ్వీ చివరికి ఏం అయ్యాడు? వంటి అన్ని విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఫస్ట్ ఆఫ్ అంతా బాలయ్య జైల్లో జైలర్‌ను కలవడం, తర్వాత ఆయన కూతురు(శ్రీలీల)తో బాండింగ్ ఏర్పడటం వంటి అంశాలను చూపించారు. జైలర్ చనిపోవడంతో ఆమె బాధ్యత తీసుకోవడం, విజ్జిని ఆర్మీలో చేర్చే ప్రయత్నం చేయడం వంటి సీన్లు కనిపిస్తాయి. రాహుల్ సంఘ్వీ డ్రగ్స్ వ్యాపారం కోసం డిప్యూటీ సీఎంను చంపేస్తాడు. అయితే ఎందుకు చంపారో లాజిక్ కనిపించదు. కొన్ని సీన్లతో ఫస్ట్ ఆఫ్ బోర్ గా అనిపిస్తుంది. సెకండ్ ఆఫ్‌లో సంఘ్వీతో కేసరికి ఉన్న గొడవ ఏంటి? కేసరి యుద్ధం మొదలు పెట్టడం వంటివి చూపిస్తారు. ఇందులో యాక్షన్ బ్లాక్‌లు, ఎమోషనల్ సీన్స్, డైలాగ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అనిల్ రావిపూడి కామెడీ..ఆశించిన స్థాయిలో లేదు. కానీ అమ్మాయిలు ధైర్యంగా ఉండాలనే మెసేజ్ ఈ చిత్రంలో చూపించారు. ముఖ్యంగా అమ్మాయి పిల్లిలా ఉండకూడదు.. పులిలా ఉండాలి అనే పాయింట్ బాగా కనిపిస్తుంది. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చూపిస్తారు. కథ పాతదే. కానీ డైరక్టర్ బాలకృష్ణను కొత్తగా చూపించారు.
ఎవరెలా చేశారంటే?
సినిమాలో బాలయ్య రొటీన్‌గా కాకుండా కొత్తగా కనిపించనున్నారనేది అనిల్ రావిపూడి ముందు నుంచే చెబుతున్నారు. అన్నట్లుగానే బాలయ్య..ఫ్యాన్స్ ఉహించని విధంగా కనిపించాడు. నేలకొండ భగవంత్ కేసరి పాత్రలో బాలయ్య జీవించేశాడు. వేర్వేరు గేటప్ల్లో కనిపిస్తూ..తెలంగాణా యాసలో మాట్లాడతాడు. కొన్ని భయాలతో బాధపడుతూ చాలా భయంతో పెరిగిన విజ్జి(శ్రీలీల) తన పాత్రకు న్యాయం చేసింది. ఈ చిత్రంలో కాజల్ పాత్ర చిన్నదే. కానీ ఆకట్టుకునే విధంగా నటించింది. విలన్‌గా అర్జున్ రాంపాల్ తన క్రూరత్వాన్ని చూపించాడు. ఇక శరత్ కుమార్, నరేన్, నగేష్, మురళీధర గౌడ్ వంటి వాళ్లు బాగానే నటించారు. బ్రహ్మాజీ సినిమాను మలుపు తిప్పే పాత్రలో కనిపించారు.
సాంకేతిక అంశాలు
కథ, స్క్రీన్ ప్లే డైలాగ్స్‌తో పాటు మంచి మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాగా అనిల్ రవిపూడి తెరకెక్కించాడు. తెలంగాణ యాసలో డైలాగ్‌లు రైటింగ్ టీం జాగ్రత్తలు తీసుకుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అందాన్ని తీసుకొచ్చింది. సినిమాలో కొన్ని ఫైట్స్ కూడా బాగున్నాయి. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
+బాలయ్య, శ్రీలల యాక్టింగ్
+డైలాగ్స్
+యాక్షన్ ఎపిసోడ్స్
+తమన్ నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
-రొటీన్ స్టోరీ
– ఫస్ట్ ఆఫ్‌లో కొన్ని సన్నివేశాలు
-పాటలు