Uttar Pradesh: కూలీ పనులు చేసుకుని జీవించే ఓ వ్యక్తి ఖాతా లోకి కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఆదాయ పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చేంత వరకు అకౌంట్లో డబ్బులు ఉన్నట్టు అతనికి తెలియదు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బస్తీ జిల్లా బతానియాకు చెందిన శివ ప్రసాద్ నిషాద్ పొట్ట కూటి కోసం ఢిల్లీ వచ్చాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటాడు. అయితే అతని బ్యాంక్ అకౌంట్లోకి రూ.221.30 కోట్లు జమ అయ్యాయి. ఈ విషయం అతనికి తెలియదు. ఆదాయపు పన్ను శాఖ అతడికి నోటీసులు జారీ చేసింది. అప్పుడు తన ఖాతాలో అంత డబ్బు ఉందనే సంగతి శివప్రసాద్‌కి తెలిసింది.
మొత్తం డబ్బులో రూ.4.58 లక్షలు టీడీఎస్ కింద కట్ అయ్యాయి. నిర్మాణ పనుల చెల్లింపుల్లో భాగంగా లావాదేవీలు జరిగి ఉంటాయని పేర్కొంది. ఆశ్చర్యపోయిన శివ ప్రసాద్ వెంటనే ఢిల్లీ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. అసలు ఇంత డబ్బు తన అకౌంట్లోకి ఎలా వచ్చిందని ఆలోచించాడు. అప్పుడు శివప్రసాద్‌కి ఒక విషయం గుర్తుకొచ్చింది. 2019లో శివ తన పాన్ కార్డును పొగొట్టుకున్నాడు. ఎవరైనా తన పాన్ కార్డుతో నకిలీ లావాదేవీలు నిర్వహించవచ్చని అనుమానించాడు. సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.