Sagiletikatha : రాయలసీమ పగల మధ్య సాగే ప్రేమ కథ.. ‘సగిలేటి కథ’ మూవీ రివ్యూ
ప్రేమ, పగను మిక్స్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా సగిలేటి కథ. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మూవీ సినీ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వనుంది? సినిమా మొత్తానికి 'సగిలేటి కథ' ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
రాయలసీమ ప్రాంతానికి చెందిన సగిలేరు అనే గ్రామంలో జరిగే ప్రేమకథే ఈ ‘సగిలేటి కథ’. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన రవి మహాదాస్యం ఇందులో హీరోగా నటించారు. రచ్చ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ విషిక ఇందులో హీరోయిన్గా నటించింది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ మూవీని దర్శకుడు రాజశేఖర్ సుద్మూన్ తెరకెక్కించారు. హీరో నవదీప్ సీస్పేస్ సమర్పణలో ఈ మూవీని విడుదల చేశారు. షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
సినిమా కథ ఏంటంటే:
రాయలసీమ పల్లెటూరులో జరిగే కథ ఇది. అప్పుడే కువైట్ నుంచి వచ్చిన మన హీరో కుమార్ ఊర్లో కృష్ణ కుమారిని చూసి ఎంతగానో ఇష్టపడతాడు. వారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అలా ఆ ప్రేమ పక్షులు ప్రేమలో ఉండగానే ఊర్లో జాతర గురించి పెద్దలు మాట్లాడుకుంటారు. ఊళ్ళో కష్టాలు తీరడానికి గంగానమ్మ జాతర చేయాలని ఊరి పెద్దలంతా నిర్ణయం తీసుకుంటారు. ఆ ఊరి పెద్దలు ఎవరంటే కుమార్, కృష్ణకుమారి నాన్నలే. వాళ్లిద్దరే ప్రతి ఏడాది ఆ జాతరను జరిపిస్తుంటారు. అయితే ఈసారి జాతర సమయానికి హీరోయిన్ వాళ్ల నాన్న దొరస్వామి రాలేకపోతాడు. దీంతో హీరో వాళ్ల నాన్న చౌడప్ప ఆధ్వర్యంలో జాతర ప్రారంభిస్తారు. ఆలస్యంగా వచ్చిన దొరస్వామి.. చౌడప్పతో తగువు పెట్టుకుంటాడు. ఇక మిత్రులుగా ఉన్న వాళ్లిద్దరూ శత్రువులుగా మారి పెద్ద గొడవకు దిగుతారు. ఆ గొడవలోనే చౌడప్ప దొరస్వామిని కత్తితో నరికి చంపేస్తాడు. క్షణికావేశంలో జరిగిన పొరపాటు వల్ల ఓ ప్రాణం బలైపోతుంది. కథ ఆసక్తిగా సాగే ఆ సమయంలో అప్పుడే విరామం కార్డు పడుతుంది. సెకండ్ హాఫ్‌లో.. హీరోయిన్ వాళ్ళ నాన్నని చౌడప్ప చంపడంతో హీరోహీరోయిన్ ప్రేమ ఏమైందనేది తెరమీద చూడాల్సిందే. జాతర కోసం ఊరి పెద్దలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? చివరికి ఆ ప్రేమికులు కలుసుకుంటారా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.
ఎలా ఉందంటే:
స్క్రీన్ ప్లే చాలా బావుంది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అందర్నీ కథలోకి తీసుకెళ్తుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ, ఫన్, లవ్, సెంటిమెంట్ కనిపించినా ఇంటర్వెల్ నుంచి సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే రెండు ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. రోషం రాజు క్యారెక్టర్ సీన్స్ అన్నీ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాయి. క్లైమాక్స్‌లో కథ ఎండ్ అవ్వదు. అది కొందరికి నచ్చకపోవచ్చు.
ఏది ప్లస్, ఏది మైనస్:
రాయలసీమ కథ కావడంతో కొన్ని పదాలు కొందరికి అర్థం కావు. యూట్యూబ్‌లో మెప్పించిన రవి మహాదాస్యం హీరోగా అదరగొట్టాడు. పల్లెటూరి అందాలతో హీరోయిన్ విషిక కూడా అందర్నీ మెప్పిస్తుంది. రోషం రాజు క్యారెక్టర్ చేసిన నరసింహ ప్రసాద్ అందర్నీ నవ్విస్తాడు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే లోకల్ మ్యూజిక్, సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తాయి. చికెన్ కర్రీ వండే విధానం పాట రూపంలో చూపడం అందర్నీ ఆకట్టుకుంటుంది. పల్లెటూరి కెమెరా విజువల్స్ కనువిందు చేస్తాయి.