మ్యాడ్ టీజర్ చూసి..జాతిరత్నాలు తరహాలో ఉందని ప్రేక్షకులు అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అయితే నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె హారిక్ సూర్యదేవర నిర్మాతగా తెలుగు ఇండ్రస్టీకి ఈ సినిమాతో పరిచయం అయ్యారు. ఇప్పటివరకు ఈ బ్యానర్లో ఎన్నో సినిమాలు హిట్ కొట్టాయి. కానీ ఇందులో పూర్తి కామెడీ విభాగంలో సినిమాలు రావడం చాలా తక్కువ. హారిక & హాసిని బ్యానర్లో వచ్చిన ఈ సినిమా మరి హిట్ కొట్టిందో లేదో ఇప్పుడు చూద్దాం.
చిత్రం: మ్యాడ్ నటీనటులు:నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, గౌరీప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యాన్, విష్ణు, అనుదీప్, మురళీధర్ గౌడ్, రఘు బాబు తదితరులు రచయిత, దర్శకుడు:కల్యాణ్ శంకర్ నిర్మాత:హారిక్ సూర్యదేవర, సాయి సౌజన్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రాఫర్:శ్యామ్ దత్-దినేష్ క్రిష్ణన్ బి విడుదల తేదీ: 06/10/2023
కాలేజీ నేపథ్యంలో వచ్చిన సినిమాలకు యువత ఎక్కువగా ఆకర్షితులవుతారు. గతంలో వచ్చిన హ్యపీడేస్, కేరింత వంటి చిత్రాలు యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇదే తరహా కాన్సెప్ట్‌తో ఈ రోజు రిలీజ్ అయ్యింది మ్యాడ్ సినిమా. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్, సంతోష్ శోభన్ సోదరుడు సంగీత్ శోభన్ కూడా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. అయితే ‘మ్యాడ్’ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో లేదో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం.
కథ
రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో మనోజ్(రామ్ నితిన్), అశోక్(నార్నె నితిన్), దామోదర్(సంగీత్ శోభన్) చదువుతుంటారు. బాస్కెట్ బాల్ పోటీలో గెలిచి వీళ్లు ముగ్గురు స్నేహితులవుతారు. అయితే మనోజ్(రామ్ నితిన్), శృతి(గౌరి)ని ప్రేమిస్తాడు. జెన్నీ(అనంతిక), అశోక్(నార్నె నితిన్)ను ఇష్టపడుతుంటుంది. మనోజ్ కనిపించిన ప్రతీ అమ్మాయిని ఫ్లర్టింగ్ చేస్తాడు. కానీ దామోదర్ అలియాస్ డీడీ నన్ను ఎవరు ఇష్టపడతారని సింగిల్ లైఫ్ బెస్ట్ అన్నట్లు ఉంటాడు. అదే సమయంలో డీడీకి వెన్నెల అనే అమ్మాయి ఒక లవ్ లెటర్ వస్తుంది. ఆ అమ్మాయిని చూడకుండానే డీడీ ప్రేమలో పడతాడు. ఇంతకీ ఆ ప్రేమలేఖ రాసింది ఎవరు? వీళ్ల ప్రేమకథలు సక్సెస్ అయ్యాయా? లేదా ఫెయిల్ అయ్యాయా? ఆ కాలేజీలో వీళ్లు చేసే అల్లరి వంటి విషయాలు గురించి తెలిపేదే మ్యాడ్ మూవీ స్టోరీ.
ఎలా ఉందంటే?
కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఎలా ఉంటారు. వాళ్లు ప్రవర్తన ఎలా ఉంటుందనే సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తాయి. కాలేజీ అంటే అందరికి ఎక్కువగా గుర్తుచ్చేది ర్యాగింగ్. ఇలాంటి సన్నివేశాల్లో కామెడీని చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు. చిన్నప్పటి నుంచి ఎంతమంది స్నేహితులు ఉన్నా..కాలేజీలో పరిచయం అయిన వాళ్లు శాశ్వతంగా గుర్తిండిపోతారు. ఇలా కాలేజీలో దొరికే స్నేహాల గురించి డైరెక్టర్ చాలా చక్కగా చూపించారు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకోవడం ఇష్టం లేని ఓ విద్యార్థి పారిపోయే..సిట్యూవేషన్ నుంచి మళ్లీ అదే కాలేజీలో చదువుకోవాలనే నిర్ణయం తీసుకుంటారు. సినిమా ప్రథమార్థంలో పరిచయాలు, క్యాంపస్ కబుర్లు, ప్రేమ కబుర్లతో సాగుతుంది. ద్వితీయార్థంలో డీడీ వెన్నెల గురించి వెతుకుతుంటాడు. అలాగే మనోజ్, అశోక్ జంటల ప్రేమ సన్నివేశాలు, హాస్టల్లో జరిగే విషయాలు కనిపిస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రేక్షకులు ప్రతి సెకన్ కూడా నవ్వుతూనే ఉంటారని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే?
ప్రధాన పాత్రల్లో నటించిన మనోజ్(Manoj), అశోక్(Ashok), దామోదర్(Damodhar) పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకుని ఈ సినిమాకి మ్యాడ్(Mad) అని టైటిల్ పెట్టారు. అయితే ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ల పాత్రలకు ప్రతి ఒక్కరూ న్యాయం చేశారు. అశోక్ పాత్రలో లీనమైన నార్నె నితిన్, వేగంగా చెప్పే సంభాషణలతో సంగీత్ శోభన్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అమ్మాయిలు గౌరి, అనంతిక కూడా చక్కగా నవ్వించారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ అతిథి పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. దీంతోపాటు మిగతా నటీనటులు కూడా వారి క్యారెక్టర్ల పరిధి మేరకు యాక్ట్ చేశారు.
సాంకేతిక అంశాలు
సినిమాలో చూపించే కాలేజీ సన్నివేశాలు, క్యాంపస్ వాతావరణం, పాత్రలను చక్కగా చూపించారు. కానీ పాటలు ప్రేక్షకులను అంతగా ఆకర్షించలేదు. నిర్మాతగా పరిచయం అయిన హారిక సూర్యదేవర మొదటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.