»Nia Conducts Raids In Civil Rights Activists Homes
NIA Raids: పౌరహక్కుల నేతలు, న్యాయవాదుల ఇంట్లో సోదాలు
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 60 చోట్ల ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులు, ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో ప్రజా సంఘాల నేతలు, న్యాయవాదుల ఇంట్లో రైడ్స్ చేపట్టారు.
NIA Conducts Raids In Civil Rights Activists Homes
NIA Raids: మావోయిస్టులకు సహకరిస్తున్నారనే సమాచారంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు (NIA) ఈ రోజు ఉదయం నుంచి 60 చోట్ల సోదాలు నిర్వహించారు. పలువురు పౌరహక్కుల నేతలు, న్యాయవాదుల ఇళ్లలో రైడ్స్ నిర్వహించారు. హైదరాబాద్ విద్యానగర్‌లో న్యాయవాది సురేశ్ ఇంటిని నిశీతంగా పరిశీలించారు. మావోయిస్టులతో సంబంధాల గురించి అడిగినట్టు సమాచారం. బ్యాంక్ స్టేట్ మెంట్లను పరిశీలించారు. మరోసారి విచారణకు పిలిస్తే రావాలని కోరారు. అమరులు బంధుమిత్రుల సంఘం కార్యకర్త భవానీ ఇంటిని కూడా పరిశీలించారు.
నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేటలో ఏపీ సీఎల్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు ఇంటిలో తనిఖీలు చేపట్టారు. ఆయన రెండు దశాబ్దాలుగా పౌరహక్కుల ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో పౌరహక్కుల సంఘం కార్యవర్గ సభ్యుడు డాక్టర్ టీ రాజారావు నివాసంలో కూడా సెర్చ్ చేసింది.
తిరుపతిలో న్యాయవాది క్రాంతి చైతన్య ఇంట్లో కూడా రైడ్స్ చేశారు. ఇతనికి ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో దాడులు చేసింది. ముచ్చవానిపేటలో ఉన్న మస్కా కృష్ణయ్య ఇంట్లో కూడా సోదాలు చేశారు. ఇతను కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
అనంతపురం బిందెల కాలనీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. శింగనమల మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీరాములు ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ప్రజా చైతన్య ఉద్యమాల కోసం ఎరికుల శ్రీరాములు రచనలు చేశారు. విజయవాడ పూర్ణనందం పేటలో అడ్వకేట్ టీ ఆంజనేయులు ఇంట్లో కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి.
ప్రజా సంఘాల నేతలతోపాటు అడ్వకేట్ల ఇళ్లలో ఎన్ఐఏ రైడ్స్ నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏదైనా ఇన్ఫో ఉంటేనే.. ఏజెన్సీ సోదాలు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లో అడ్వకేట్ సురేశ్‌ను మరోసారి విచారణకు హాజరు కావాలని స్పష్టంచేసింది.