చంద్రయాన్ 3 ఉపగ్రహం ప్రయోగించి చాలా రోజులు అవుతుంది. అందుకు సంబంధించిన ప్రజ్ఞాన్ రోవర్(Pragyan rover) ఈనెల మొదటి వారం నుంచి స్లీప్ మోడ్ లోనే ఉంది. అయితే ఈ అంశంపై ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్(somnath) స్పందించారు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్.సోమనాథ్(somnath) గురువారం చంద్రయాన్ -3 ప్రజ్ఞాన్ రోవర్ స్లీప్ మోడ్ అంశంపై స్పందించారు. అయితే ఇప్పటికే అది అనుకున్న పనిని పూర్తి చేసిందని, అది విఫలమైనా సమస్య లేదని అన్నారు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలోని ప్రసిద్ధ సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు. చంద్రునిపై వాతావరణం కారణంగా దాని ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు దెబ్బతినకుండా ఉంటే, ఉష్ణోగ్రత సున్నా కంటే దాదాపు 200 డిగ్రీల సెల్సియస్ తగ్గి ఉండవచ్చన్నారు. స్లీప్ మోడ్‌లోకి వెళ్లిన తర్వాత ‘వేక్-అప్ పరిస్థితి’ని నిర్ధారించడానికి చంద్రయాన్ -3 ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేసినట్లు ఇస్రో గత వారం తెలిపింది. కానీ ఎలాంటి సంకేతాలు అందలేదు. ల్యాండర్, రోవర్ రెండూ కూడా సెప్టెంబరు 4న స్లీప్ మోడ్‌లోకి వెళ్లాయి.
ఇక రాబోయే మిషన్ల గురించి సోమనాథ్ ఇస్రో ఇప్పుడు XPoSat లేదా X-ray Polarimeter ఉపగ్రహం ప్రయోగాల కోసం సిద్ధమవుతోందని చెప్పారు. ఈ XpoSat..PSLV రాకెట్ ద్వారా ప్రయోగించబడుతుందన్నారు. ఇంకా తేదీలను ప్రకటించనప్పటికీ, నవంబర్ లేదా డిసెంబర్లో దీనిని ప్రయోగించవచ్చన్నారు. ఇది బ్లాక్ హోల్స్, నెబ్యులాస్, పల్సర్లను అధ్యయనం చేసే లక్ష్యంతో ప్రయోగించనున్నట్లు ఆయన వెల్లడించారు. మరో మిషన్ ఇన్సాట్-3డిఎస్ వాతావరణ ఉపగ్రహం డిసెంబర్లో ప్రయోగించనున్నట్లు సోమనాథ్ తెలిపారు.