భాగ్యనగరం నిమజ్జనానికి సిద్ధమైంది. హుస్సేన్‌సాగర్(Hussainsagar)తోపాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు 100 చోట్ల నిమజ్జనాలు జరగనున్నాయి. ఇందుకోసం జీహెచ్ఎంసీ (GHMC) క్రేన్లు, జేసీబీలు, టిప్పర్లతోపాటు వేలాదిమంది సిబ్బందిని ఏర్పాటు చేసింది. నిమజ్జనం సందర్భంగా ప్రమాదవశాత్తు ఎవరైనా వాటర్‌లో పడిపోతే రక్షించేందుకు 200 మంది గజ ఈతగాళ్లను కూడా సిద్ధం చేసింది.అలాగే, శోభాయాత్ర (Shobhayatra) జరిగే రోడ్డుపై వైద్య శిబిరాలు, 79 అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచింది. మరోవైపు ఖైరతాబాద్ (Khairatabad) గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 11:30 గంటలకు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బాలానగర్ నుంచి ట్రాలీ రానుంది.
రాత్రి 9 గంటలకు ఎన్టీఆర్ గార్డెన్ (NTR Garden)కు భారీ క్రేన్ చేరుకోనుంది. రాత్రి 10 గంటల నుంచి విగ్రహం తరలింపునకు ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10:30 గంటలకు క్రేన్ నెంబర్ 4 దగ్గర పూజ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఒక్క హైదరాబాద్ (Hyderabad) కమిషనరేట్ పరిధిలోనే 25 వేలమందికిపైగా పోలీసులను మోహరించబోతున్నారు. కాగా, 35 సంవత్సరాల తర్వాత మిలాద్ ఉన్ నబీ.. గణేశ్ నిమజ్జనం ఒకేసారి రావడంతో పోలీసు (Police) ఉన్నతాధికారులు ముందుజాగ్రత్త చర్యగా ముస్లిం మతపెద్దలతో మాట్లాడారు. మిలాద్ ఉన్ నబీ (Milad un Nabi) ర్యాలీని ఒకటో తేదీకి వాయిదా వేయించారు. కొందరు మాత్రం అదే రోజున జరపాలని పట్టుబడుతున్నారు. మహా గణపతులను గంగమ్మ చెంతకు చేర్చేందుకు 16 టైర్లతో కూడిన 250 టస్కర్లు, మరో 2 వేల ఇతర వాహనాలను రవాణాశాఖ సిద్ధం చేసింది.