»Navdeeps Investigation In The Drug Case Is Over What Did He Tell The Police
Navdeep: డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ పూర్తి.. పోలీసులకు ఏం చెప్పాడంటే
డ్రగ్స్ కేసు విచారణలో హీరో నవదీప్ నార్కోటిక్ అధికారులకు సహకరించారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానాలిచ్చారు. అయితే నవదీప్ సెల్ ఫోన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి నవదీప్‌ను విచారణకు రావాలని తెలిపారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ పోలీసులు హీరో నవదీప్‌ను విచారించారు. నేడు పోలీసుల ఎదుట హాజరైన నవదీప్..విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు ఏడేళ్ల క్రితం తన కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి కొంత సమాచారం కోసం తనకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.
బీపీఎం అనే క్లబ్‌తో తనకున్న సంబంధాల గురించి పోలీసులు అడిగి తెలుసుకున్నారని నవదీప్ తెలిపారు. తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, విశాఖకు చెందిన రామ్ చందర్ వద్ద తాను ఎప్పుడూ డ్రగ్స్ కొనలేదన్నారు. గతంలో తాను పబ్ నిర్వహించినందు వల్లే తనను విచారించినట్లు చెప్పుకొచ్చారు. గతంలో తనను సిట్, ఈడీ అధికారులు కూడా విచారించిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం తనను నార్కో పోలీసులు విచారిస్తున్నారని, వారు అడిగిన ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని నార్కో అధికారులు చెప్పారన్నారు. తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు అద్భుతమైన టీమ్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఈ అధికారులకు దేశంలోనే మంచి రికార్డు ఉందన్నారు. కాగా అధికారులు నవదీప్ సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో మళ్లీ విచారణకు నవదీప్ హాజరయ్యే అవకాశం ఉంది.