»Telangana Elections In Two To Three Months 15 Lakh New Votes Registered
Telangana: మరో రెండు మూడు నెలల్లో తెలంగాణ ఎన్నికలు.. 15 లక్షల కొత్త ఓట్లు నమోదు
తెలంగాణలో మరో రెండు మూడు నెలల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనుందని ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తోంది. ఈ తరుణంలో ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలపై ఓ ప్రకటన చేశారు. హైదరాబాదులోని బీఆర్కే భవన్ లో ఆయన మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు సిద్ధం అవుతున్నామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని, అన్ని జిల్లాల అధికారులకు ఈవీఎంలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో చిరునామాల మార్పుపై తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. వాటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఈసారి తెలంగాణలో 15 లక్షల కొత్త ఓటర్లు నమోదయ్యారని తెలిపారు. అందులో 6.99 లక్షల మంది యువ ఓటర్లని వెల్లడించారు. మహిళా ఓటర్ల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అక్టోబరు మొదటివారంలో తెలంగాణలో కేంద్రం ఎన్నికల సంఘం పర్యటన ఉందని, ప్రతి జిల్లాల్లో ఆ టీమ్లు పర్యటిస్తాయని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు.