జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan), నందమూరి బాలకృష్ణ(balakrishna) రాజమహేంద్రవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి జనసేన నేతలు పవన్ కు ఘన స్వాగతం పలికారు. పవన్ బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రాజమండ్రి చేరుకోగా..అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సెంట్రల్ జైలుకు వెళ్లారు. అక్కడ ఉన్న ‘ఖైదీ నెం 7691’ చంద్రబాబు నాయుడిని కాసేపట్లో కలవనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు రాజమండ్రిలో ఆంక్షలు విధించారు. నలుగురికి మించి గుమికూడదని, ర్యాలీలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు బాలకృష్ణ కూడా రాజమండ్రి చేరుకున్నారు. సెంట్రల్ జైలు(central jail) పరిధిలోని క్యాంపులో ఉన్న నారా లోకేష్ శిబిరానికి చేరుకుని నారా భువనేశ్వరి, బ్రాహ్మణిని కలుసుకుని వారికి సంఘీభావం తెలిపారు. నాయుడు త్వరలో క్లీన్‌గా వస్తారని వారిని ఓదార్చారు. దీంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా రాజమహేంద్రవరంలోని నారా లోకేష్ క్యాంపును సందర్శించి, ఆ తర్వాత సెంట్రల్ జైలుకు వెళ్లి నాయుడుని 12 గంటలకు కలవనున్నారు.
పవన్ కళ్యాణ్ రాజమండ్రి రాకకు పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో పాటు టీడీపీ(TDP) నేతలు, కార్యకర్తలు కూడా గణనీయ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగా పోలీసులు అప్రమత్తమై విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే రాజమండ్రిలో బహిరంగ సభలపై ఆంక్షలు విధించే 144 సెక్షన్ అమలులో ఉంది. మరోవైపు, చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో టీడీపీ క్యాడర్ రిలే నిరాహార దీక్షలు చేపట్టగా, కొందరు వ్యక్తులు నాయుడు క్షేమం కోసం పలు దేవాలయాల్లో ప్రార్థనలు చేస్తున్నారు.