»The Specialty Of Rakhi Festival Is Its Unique History Of Mythology
Rakhi festival: రాఖీపండుగ ప్రత్యేకత.. విశిష్టత
కులలకు అతీతంగా జరుపుకునే పండుగ రాఖీ. సోదరులు బాగుండాలని, వారు అభివృద్ధి సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సోదరీమణులు కట్టే రాఖీ. కేవలం రక్త సంబంధీకులకే కాదు సోదరసమానులైన వారెవరికైనా సరే కట్టొచ్చు.
The specialty of Rakhi festival is its unique history of mythology
Rakhi festival:దేశం(India)లో అన్ని కులాల వారు జరుపుకునే రాఖీ పండుగకు(Rakhi Festival) చాలా ప్రాముఖ్యత ఉంది. అక్కచెల్లెల్లు, అన్నదమ్ములకు రాఖీ కడుతారు. సోదరులు వారి సోదరికి జీవితాంతం తోడుగా ఉంటామనే భరోసా కల్పిస్తారు. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అని వ్యవహరిస్తారు.
ఎలా జరుపుకోవాలి
శ్రావణపౌర్ణమి రోజున రాఖీపండుగను జరుపుకోవడానికి పురోహితులు శుభగడియాలను ముందుగానే చెబుతారు. సోదరులకు బొట్టు పెట్టి, రాఖీ పట్టీలను కట్టి హారతి ఇస్తారు. ఈ రాఖీని కట్టేటప్పుడు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః | తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల ||` అన్న మంత్రాన్ని చదివితే మంచిదని చెబుతారు. తరువాత ఇరువురు స్వీటు తినిపించుకుంటారు. వారి ఆశీర్వాదం తీసుకుంటారు. తరువాత సోదరులు సంతోషంతో సోదరికి బహుమతి ఇస్తారు. ఎల్లప్పుడు తనకు రక్షణగా ఉంటామనే భరోసాతో ఆడబిడ్డ సంతోషంగా ఉంటుంది.
పురాణచరిత్రలు ఇంద్రునికి ధైర్యం నింపిన శచీదేవి
పూర్వం దేవతలకు, రాక్షసులకు యుద్ధం జరిగింది. ఈ పోరులో నిలవలేక దేవేంద్రుడు తన పరివారంతో అమరావతిలో తలదాచుకుంటాడు. ఇంద్రుని నిస్సహాయతను చూసిన ఆయన భార్య శచీదేవి యుద్ధం చేయమని లేదంటే అమరావతిని రాక్షసరాజు చుట్టుముట్టి అందరినీ సంహరిస్తాడని హెచ్చరిస్తుంది. ఆమె మాట విన్న దేవేంద్రుడు యుద్ధానికి సిద్దం అవుతాడు. ఆ రోజు శ్రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను అత్యంత భక్తితో పూజించి రక్షను దేవేంద్రుడు చేతికి కట్టి యుద్ధానికి పంపుతుంది. దాంతో దేవతలందరూ విజయం సాధిస్తారు. అలా రానున్న కాలంలో రక్షబంధన్గా మారిందని పురాణాల్లో తెలుస్తుంది.
శ్రీకృష్ణుడి రక్షణ పొందిన ద్రౌపతి
శిశుపాలుడిని వధించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు గాయం అయి రక్తం కారుతుంది. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.
బలిచక్రర్తికి రక్ష కట్టిన లక్ష్మీదేవి
రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి తన రాజ్య రక్షణా భారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండిపోవలసి వస్తుంది. అప్పుడు విష్ణవు భార్య అయిన లక్ష్మీ దేవి శ్రావణ పూర్ణిమ రోజున మహాబలి చేతికి రాఖీ కడుతుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీకి మెచ్చిన బలి శ్రీ మహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహా విష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.
హయగ్రీవావతారం
పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి కేవలం గుర్రం తల ఉన్న మనిషితో తప్ప మరేవిధంగా తనకు మరణం లేని వరం పొందాడు. దీంతో ఆ రాక్షసుడు రెచ్చిపోయి దేవతలను చిత్రహింసలకు గురిచేస్తాడు. వారితో యుద్దం చేస్తాడు. యుద్దంలో అలసిపోయిన విష్ణువు గాడనిద్రలో ఉంటాడు. ఆయన్ను లేపడం ఏవరి తరం కాదు. అందుకని శివుడి ఆజ్ఙ మేరకు వమ్రి కీటకం ఎక్కుపెట్టిన విష్ణుమూర్తి దనుస్సు వింటినినారిని కొరుకుతుంది. దాంతో బాణం విష్ణువు తలను తెచ్చుకొని పోతుంది. దేవతలంతా తపస్సు చేసి ఒక గుర్రం తలను విష్ణువుకు అతికిస్తారు. విష్ణువు తిరిగి లేచిన రోజు శ్రావణపూర్ణిమ. హయగ్రీవావతరంలో ఉన్న విష్ణువు రాక్షసుడిపై యుద్ధం గెలుస్తాడు. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరుపుతారు.
పురాణాల్లోనే కాదు చరిత్రలో కూడా రక్షబంధన్కు ఘనమైన చరిత్ర ఉంది. ప్రపంచాన్ని జయించాలని గ్రీకు రాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ సమయంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. తరువాత దేశంపై యుద్దం ప్రకటిస్తాడు. దేశాన్ని పరిపాలించే పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. దీంతో అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు. ఇది రాఖీకి ఉన్న విశిష్టతను తెలియజేస్తుంది.
ఇతర సాంప్రదాయాలు
శ్రావణపౌర్ణమి రోజున కేవలం రాఖీ మాత్రమే కాదు… ఇతరత్రా ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. జంధ్యం ఆనవాయితీ ఉన్న వారు, ఈ రోజున పాత జంధ్యం స్థానంలో నూతన జంధ్యాన్ని ధరిస్తారు. అందుకనే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. విష్ణుమూర్తి జ్ఞానస్వరూపమైన హయగ్రీవుడు ఉద్భవించిందీ ఈ రోజునే. అంచేత హయగ్రీవ జయంతినీ జరుపుకొంటారు. ఇక బెంగాల్ రాష్ట్రంలో ఝూలన్ పౌర్ణమి పేరుతో, ఈ రోజున రాధాకృష్ణుల విగ్రహాలను ఊయలలో ఉంచి ఊరేగిస్తారు. మరి కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో కజరి పౌర్ణమి పేరుతో గోధుమ నాట్లు వేస్తారు. ఇక సముద్రతీరంలో ఉండేవారు నరాళీ పౌర్ణమి పేరుతో సముద్రదేవునికి కొబ్బరికాయలను సమర్పిస్తారు.