జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎందుకు తిడుతున్నారో అర్థం కావడం లేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. టీడీపీ-జనసేన కలిస్తే వారికి అంత భయం, పిరికితనం ఎందుకు అని ప్రశ్నించారు. అధికారం ఉందనే అహంకారం కనిపిస్తోందని, కానీ అది ఏమాత్రం మంచిది కాదని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. నిన్న రణస్థలంలో పవన్ సభ ద్వారా తాను ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పేశారని వ్యాఖ్యానించారు.
సేవాభావం ఉన్న వ్యక్తులే రాజకీయాల్లో ఉండాలని, కానీ ఇప్పుడు అర్హత లేని వారు రాజకీయాలను శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు దాడికి దిగడం ద్వారా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, కేసులకు భయపడే పరిస్థితి లేదని, కార్యకర్తలు తెగించి రోడ్లపైకి వస్తున్నారన్నారు. జైల్లో పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తామంటే ఎవరూ లొంగరన్నారు.
ఏ రాజకీయ పార్టీ సమావేశాలు పెట్టుకోవద్దంటూ జీవో నెంబర్ 1 తీసుకు వచ్చారని, మరి వైసీపీ మాత్రం పెట్టుకోవచ్చా, ఇదేం ద్వంద్వ నీతి అని ప్రశ్నించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తన పోరాటం ఆగదని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటామన్నారు. వైసీపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. విధ్వంసానికే కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారన్నారు.