ఢిల్లీ స్కూల్లో విద్యార్థులు ఫోన్ వాడకంపై నిషేధం విధించింది. దీని ద్వారా జరిగే అనర్థాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్న డైరెక్టర్స్ పిల్లల తల్లిదండ్రులను ఇందుకు సహకరించాలని కోరారు.
Phones: స్కూళ్లో(Schools) విద్యార్థులు సెల్ఫోన్లు వాడకంపై ఢిల్లీ(Delhi) ప్రభుత్వం నిషేధించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీచేశారు. టీచర్లు, ఇతర సిబ్బంది బోధించే సమయంలో ఫోన్లు వాడకూడదని ఆదేశాల్లో స్పష్టంచేశారు. క్లాస్ రూముల్లో(Class Rooms) చదువుకొనే వాతావరణం కల్పించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల ఫోన్ల వాడకం సర్వసాధారణం అయిపోయింది. సామాన్యుల నుంచి కార్పోరేట్ వ్యక్తులందరికీ ఫోన్ నిత్యవసరం అయిపోయింది. తినే సమయంలో, చదువుకునే సమయంలో కూడా ఫోన్ల వాడకం ఎక్కవగా మారింది. సెల్ఫోన్ల వాడకం వల్ల మేలుతోపాటు కీడు కూడా జరుగుతున్నది. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్ వాడటం వల్ల చెడు ప్రభావాలు పడుతున్నాయి. తీవ్ర ఒత్తిడి, తీవ్ర కోపం, తీవ్ర ఆందోళన, ఒంటరితనం, చూపు మందగించడం, నిద్రలేమి వంటి మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి.
ముఖ్యంగా పిల్లల చదువుల దృష్ట్యా వీటి వాడకం తగ్గించుకోవాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. అలాగే స్టూడెంట్స్పై సెల్ ఫోన్ ప్రతికూల ప్రభావం చూపుతోంది. సాన్నిహిత్యంగా మాట్లాడటమే తగ్గుతోంది. ఫొటోలు తీయడం, రికార్డు చేసుకోవడం, ఇతర వ్యాపకాల కారణంగా క్లాస్‌రూమ్‌లో టీచర్ చెప్పేది గ్రహించలేని పరిస్థితికి ఏర్పడింది. తరగతి గదిలో, పాఠశాల ఆవరణలో ఇతర నెగెటివ్ అవసరాలకు సెల్‌ఫోన్ వాడకం పెరుగుతున్నది. తద్వారా లెర్నింగ్ స్కిల్స్ దెబ్బతింటున్నాయి. ఈ నేపథ్యంలో తరగతి గదుల్లో సెల్‌ఫోన్ అనుమతిని నిషేధించినట్టు ఢిల్లీ పాఠశాల విద్యా డైరెక్టర్ తెలిపారు. అయితే స్కూల్ సమయం అయిపోయిన తరువాత లేదా ఏదైన ఎమర్జెన్సీ సమయంలో వాడడం వల్ల తప్పేమి లేదని వారు పేర్కొన్నారు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని విజ్ఙప్తి చేశారు.