13 ఏళ్లకు పిల్లలు తమ స్నేహితులతో ఆడుకుంటారు. బాల్యాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. తల్లిదండ్రుల వద్ద పోట్లాటలు, గోలలు, చిందులు, గెంతులు..ఇలా ఆడిపాడుతూ సాగిపోతుంటారు. కానీ తిలక్ మెహతా(Tilak Mehta) అనే 13 ఏళ్ల బాలుడు రూ.100 కోట్లను సంపాదించాడు. అంతేకాదు 200 మందికి ఉద్యోగాలిచ్చాడు. తిలక్ మెహతా తండ్రి విశాల్ మెహతా రోజూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే బాగా అలసిపోతుండేవాడు. ఆ సమయంలో తన తండ్రిని బయటి నుంచి ఏదీ తీసుకురమ్మనేవాడు కాదు.
కొన్నిసార్లు తన ఫ్రెండ్స్ ఇళ్ల వద్ద బుక్స్ మర్చిపోయేవాడు. వాటిని ఇంటికి తెప్పించుకునేందుకు డెలివరీ సంస్థల సాయం తీసుకునేవాడు. అలా ప్రజల సమస్యలను గ్రహించిన తిలక్ తన తండ్రి సాయంతో ఓ కొరియర్ సర్వీస్(Couries services)ను ప్రారంభించాడు. మొదట్లో బ్యాంక్ అధికారి ఘనశ్యామ్ పరేఖ్ తన ఉద్యోగాన్ని మాని తిలక్‌తో వ్యాపారంలో చేరాడు. తిలక్ తన కంపెనీకి పేపర్ అండ్ పెన్సిల్ (Paper and Pencil Company) పేరు పెట్టి ఘనశ్యామ్‌ను దానికి సీఈఓను చేశాడు.
మొదట్లో తమ కంపెనీకి బోటిక్స్, స్టేషనరీ షాపుల నుంచి చిన్న ఆర్డర్లు మాత్రమే వస్తూ ఉండగా ఆ తర్వాత డబ్బావాలాల సాయంతో సరుకుల పంపిణీని కూడా చేపట్టారు. ప్రస్తుతం ఆ కంపెనీ వార్షిక టర్నోవర్ రూ.100 కోట్లకు చేరుకుంది. డబ్బావాలాల సాయంతో కొరియర్ సేవలు అందించే తిలక్ కంపెనీకి ఇప్పుడు మంచి పేరు లభించింది. ఇప్పుడు తిలక్ కంపెనీలో 200 మంది పనిచేస్తున్నారు. అలాగే 300 మంది డబ్బావాలాలు కూడా అనుబంధంగా వర్క్ చేస్తుంటారు. డబ్బావాలాలకు రూ.10 వేల సంపాదన వస్తోంది. 13 ఏళ్లకే రూ.100 కోట్లు సంపాదించిన తిలక్ మెహతా ఇప్పుడు ముంబైలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.