Chief Minister's key decision.. Abolition of VRA system.!
CM KCR: తెలంగాణలో వీఆర్ఏ(VRA) పదవిపై ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలుగా పని చేస్తున్న సిబ్బంది రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో వెంటనే క్రమబద్దీకరించాలని ఆదేశాలిచ్చారు. మంత్రుల సబ్ కమిటీ సిఫార్సులతో నిబంధనలను సంస్కరించి వీఆర్ఏల అర్హత ప్రకారం మున్సిపాలిటీ(Municipality), మిషన్ భగీరథ(Mission Bhagiratha), ఇరిగేషన్(Irrigation), పంచాయితీ రాజ్(Panchayat Raj) శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేయనున్నట్లు తెలిపారు.
61ఏళ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వారసులకు ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 61ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, 2014 జూన్ 2 తర్వాత విధుల్లో మరణించిన 61ఏళ్లలోపు వీఆర్ఏల వారసులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. వీఆర్ఏల సర్దుబాటు, ఇతర అంశాలకు సంబంధించిన జీవో సోమవారం విడుదల కానుంది.