గుంటూరులో టీడీపీ సభ ప్రమాదంపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చంద్రబాబు ప్రచార యావ కారణంగా నిన్న కందుకూరులో 8 మంది, ఇప్పుడు గుంటూరులో ముగ్గురు.. మొత్తం పదకొండు మంది చనిపోయారని మంత్రులు కొడాలి నాని సోమవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు యమరథంతో ప్రజలను చంపేస్తున్నాడన్నారు. ఆయన పబ్లిసిటీ పిచ్చితో అమాయకులు బలి అవుతున్నారన్నారు. పైగా తమ నేరాన్ని పోలీసుల పైకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. శనిగ్రహాన్ని మించిన దశమ గ్రహం చంద్రబాబు అన్నారు. అసలు చంద్రబాబు బహిరంగ సభలకు అనుమతి ఇవ్వకూడదని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నెత్తిన శని తాండవిస్తోందని, ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ దశమ గ్రహం ఉంటుందన్నారు.
అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పార్టీని తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న బీఆర్ఎస్, కేసీఆర్ పైన కూడా కొడాలి నాని స్పందించారు. ఇక్కడ ఆ పార్టీ ప్రభావం శూన్యం అన్నారు. బీఆర్ఎస్ వల్లే తాము నష్టపోయామని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారన్నారు. ఏపీ ప్రజల సంక్షేమం కోసం వైసీపీ నిత్యం పని చేస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎవరితోను పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తాము అంశాలవారీగా మాత్రమే జాతీయ పార్టీలకు, కేంద్ర ప్రభుత్వాలకు మద్దతు ఇస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉందన్నారు. ఆయన తన పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించాలనుకోవచ్చునని చెప్పారు.
చంద్రబాబు సభల్లో వరుసగా అమాయకులు మృత్యువాత పడుతున్నారని, అలాంటి వ్యక్తిని డీజీపీ కట్టడి చేయాల్సి ఉందని జోగి రమేష్ అన్నారు. ఆయన ఇప్పటి వరకు నలభై మందిని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అధికారదాహం ప్రజల ప్రాణాల మీదకు వస్తోందన్నారు. ఉయ్యూరు ఫౌండేషన్ అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోకుండా ఎలా కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రశ్నించారు. 30వేల మందికి చీరలు పంచుతున్నామని చెప్పి, పదివేలమందికి తెచ్చి, మూడువేల మందికి పంచితే ఎలా అని ప్రశ్నించారు. కాగా, ఈ సభలో జరిగిన తొక్కిసలాటలో గాయపడిన వారిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ప్రభుత్వంపరంగా వారిని ఆదుకుంటామని చెప్పారు.