Love Story: వీరి ప్రేమ కథతో ఓ సినిమా తీసేయవచ్చు..!
ప్రేమ అంటే వీరిదే.. అవును కలిసారు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఎడబాటు తప్పలేదు. కానీ తన భార్యను చేరుకోవడానికి ఆ భర్త 4 నెలలు సైకిల్ మీద ప్రయాణం చేశాడు.
Love Story: కొందరు ప్రేమకు (Love) అర్థం మార్చేశారు. నిన్న చూశామా, ఈ రోజు ప్రేమించామా, రేపు మర్చిపోయామా అన్నట్లుగానే అందరి ప్రేమకథలు సాగుతున్నాయి. నిజమైన ప్రేమకి అర్థం వేరే. ప్రేమించిన వారిని కలుసుకోవడానికి ఏదీ అడ్డుకాదు, చేతిలో డబ్బులు లేకపోయినా, తన ప్రేయసిని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసం అందరి చేతా ఔరా అనిపించింది. సైకిల్ మీద భారత్ నుంచి స్వీడన్‌కి వెళ్లిన ఓ ప్రేమికుడి కథ ఇది. 1975లో జరిగిన యదార్థ ప్రేమ కథ ఇది. ఆ ప్రేమ కథ మనం తెలుసుకుందామా…?
భారత్‌లోని ఓ గిరిజన తెగకు చెందిన డాక్టర్ ప్రద్యుమ్న కుమార్ మహానందియా (P. K. Mahanandia) చిత్రకారుడు కూడా. చిన్నప్పటి నుంచి అద్భుతంగా చిత్రాలు గీసేవాడు. స్వీడన్‌కి చెందిన చార్లోట్టే వోన్ షెడ్విన్ ఓసారి భారత్ వచ్చినప్పుడు అతని చిత్రాలు చూసి మైమరిచిపోయింది. అప్పటి నుంచి వారి మధ్య పరిచయం ఏర్పడింది. అదీ కాస్త ప్రేమగా మారింది. అప్పటికప్పుడే వారిద్దరూ గిరిజన సంప్రదాయంలో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి తర్వాత చార్లొట్టే తన దేశం వెళ్లిపోయింది. అప్పటికి ప్రద్యూమ్న (P. K. Mahanandia) చదువు ఇంకా పూర్తి కాలేదు. దీంతో అతను భారత్‌లో ఉండిపోయాడు. ఆ సమయంలో ఉత్తరాలతో మాట్లాడుకునేవారు.
తర్వాత అతని చదువు పూర్తయ్యింది. తన భార్య దగ్గరకు వెళ్లిపోవాలని అనుకున్నాడు. విమాన ప్రయాణం ఖర్చుతో కూడిన వ్వవహారం అని ఆగిపోయాడు. తన ప్రయాణాన్ని ఆపలేదు. అందుకోసం ఓ సైకిల్ కొనుక్కోని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తాను పొగేసిన డబ్బుతో సైకిల్ కొన్నాడు. ఆ సైకిల్ మీద ఆమెను చేరుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టాడు. నాలుగు నెలల్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీలను దాటాడు. సైకిల్ దారిలో చాలాసార్లు పాడయ్యేది. రోజుల తరబడి ఆహారం లేకుండా కూడా వెళ్ళవలసి వచ్చింది. ఏదీ అతని సంకల్పాన్ని అడ్డుకోలేదు. దారిలో కనిపించిన వారి చిత్రాలు గీస్తూ, వారు ఇచ్చే డబ్బులు, ఆహారంతో కడుపు నింపుకున్నాడట.
జనవరి 22, 1977న తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రతిరోజూ దాదాపు 70 కిలోమీటర్లు సైకిల్ ప్రయాణం చేసేవాడు. నాలుగు నెలల తర్వాత అతను తన భార్యను చేరుకున్నాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ స్వీడన్లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ ఈ జంట ఆనందంగా కలిసి ఉన్నారు.