»Madhya Pradesh Govt Drops Everest Climber Megha Parmar As Ambassador
Megha Parmar: మేఘా పర్మార్‌ను అంబాసిడర్‌గా తొలగించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
పర్వతారోహకురాలు మేఘా పర్మార్‌ను మే 10న బేటీ బచావో బేటీ పఢో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్‌గా తొలగించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎవరెస్ట్ అధిరోహకురాలు మేఘా పర్మార్‌ను అంబాసిడర్‌గా తొలగించింది. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మధ్యప్రదేశ్‌కు చెందిన మొదటి మహిళ అయిన మేఘా పర్మార్, ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమం మరియు రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్‌గా ఆమె పేరు తొలగించబడిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మే 9న చింద్వారాలో జరిగిన ఒక కార్యక్రమంలో మేఘా కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.
కాంగ్రెస్‌లో చేరిన ఒక రోజు తర్వాత, బేటీ బచావో బేటీ పఢావో కార్యక్రమానికి రాష్ట్ర అంబాసిడర్‌గా ఉన్న మేఘాను మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ రద్దు చేసింది. ఐదు రోజుల తర్వాత, మే 15న, రాష్ట్ర డెయిరీ బ్రాండ్ సాంచి అంబాసిడర్‌గా ఆమె పేరు కూడా తొలగించబడింది. ఈ పరిణామాన్ని అనుసరించి, కాంగ్రెస్‌లో చేరినందుకే మేఘాను అంబాసిడర్ పాత్ర నుండి తొలగించారని కాంగ్రెస్ ఆరోపిస్తూ, బిజెపిపై విరుచుకుపడింది. “దేశం గర్వించేలా చేసిన మేఘా పర్మార్‌ను కాంగ్రెస్‌లో చేరడమే ఏకైక నేరంగా ‘బేటీ బచావో, బేటీ పఢావో’ అంబాసిడర్‌గా తొలగించారు” అని ఆ పార్టీ నాయకుడు కెకె మిశ్రా అన్నారు.
అంబాసిడర్‌గా తన ప్రస్తుత బాధ్యత నుంచి వైదొలగడంపై మేఘా పర్మార్ మాట్లాడుతూ, “బీజేపీకి బేటీ బచావో బేటీ హటావోగా మారింది”. నేను రైతు కూతురిని. ప్రపంచంలోని ఎత్తైన శిఖరాన్ని జయించడాన్ని నేను ఊహించలేకపోయాను. కమల్ నాథ్ నాకు చాలా సహాయం చేశారు. అతను నాకు ఆర్థిక సహాయం చేశారు. ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని జయించగలిగాను. సినీ నటీమణులకు బదులు రైతు కూతురిని ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు కమల్‌నాథ్. కానీ మహిళల గౌరవం గురించి పెద్దగా మాట్లాడే బీజేపీ ప్రభుత్వం అదే రైతు కూతురిని బ్రాండ్ అంబాసిడర్ నుంచి తప్పించింది” అని మేఘా పర్మార్ అన్నారు.
“ఈ రోజు మహిళా సాధికారత గురించి బీజేపీ చేస్తున్న వాదనలు బట్టబయలయ్యాయి. శివరాజ్ ప్రభుత్వ చర్య నన్ను అవమానించడమే కాకుండా మహిళా సాధికారతను కించపరిచింది” అని ఆమె అన్నారు. కాగా, మేఘా పర్మార్, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. మే 22, 2019న, ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న మధ్యప్రదేశ్‌కు చెందిన మొదటి మహిళగా మేఘ నిలిచింది.