ప్రముఖ మల్టీప్లెక్స్ ఆపరేటర్ PVR INOX Ltd ఇటీవల 3.33 బిలియన్ రూపాయల ($40.72 మిలియన్లు) త్రైమాసిక నష్టాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమా థియేటర్లను క్లోజ్ చేయాలని నిర్ణయించారు.
మల్టీ ప్లెక్స్ లు ఇప్పుడు చాలానే పుట్టుకువచ్చాయి. కానీ, ఒకప్పుడు మల్టీ ప్లెక్స్ అంటే అందరికీ పీవీఆర్ గుర్తుకువచ్చేది. మల్టీప్లెక్స్ లో సినిమా చూస్తే కలిగే ఫీలింగే అద్భుతంగా ఉండేది. అలాంటి పీవీఆర్(PVR INOX) తాజాగా షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 50 స్క్రీన్లని మూసివేయనుంది.
తీవ్రనష్టాల్లోకి కూరుకుపోవడంతో ఈ నిర్ణయం తీసుకుందట. మల్టీప్లెక్స్ స్క్రీన్ల నిర్వహణలో టాప్‌గా ఉన్న PVR సినిమా సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. జనవరి-మార్చి నాలుగో త్రైమాసికంలో పీవీఆర్- ఐనాక్స్కు దాదాపు రూ.333 కోట్ల నష్టం వచ్చింది.
గతేడాది ఇదే సమయంలోనూ వందకోట్లకుపైగా నష్టాలపాలైంది. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడం, అందుకు తగ్గట్టుగా ఆదాయం లేకపోవడం, బాలివుడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చతికిలపడటంతో సంస్థ నష్టాలను చవి చూసింది. వీటికి తోడు ఓటీటీల ప్రభావం ఉండనే ఉంది. ఇక నష్టాల్లో ఉన్న పలు చోట్ల స్క్రీన్లను మూసివేయాలని ఈ సంస్థ నిర్ణయించింది.
ఈ విధంగా రానున్న ఆరు నెలల్లో 50 PVR స్క్రీన్స్ మూతపడబోతున్నాయి. అయితే, స్క్రీన్లు మూసివేసినా.. మల్టీప్లెక్స్‌లలోని మాల్స్ కొనసాగుతాయని పీవీఆర్-ఐనాక్స్ తెలిపింది. ఏడాది క్రితం PVR, ఐనాక్స్ లీజర్ సంస్థలు విలీనం అవ్వడం ద్వారా దేశంలోనే అతిపెద్ద మల్టిప్లెక్స్ సంస్థ ఆవతరించిన విషయం తెలిసిందే.
పీవీఆర్-ఐనాక్స్ థియేటర్స్ పేరుతో భారత్, శ్రీలంకలో మొత్తం 1,689 మల్టీప్లెక్స్ స్క్రీన్లు నడుపుతోంది ఈ సంస్థ. గత ఆర్థిక సంవత్సరంలో పీవీఆర్-ఐనాక్స్ కొత్తగా 168 స్క్రీన్లను ఓపెన్ చేశాయి కూడా. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో 150-175 స్క్రీన్లను ఓపెన్ చేయాలని భావించింది. వీటిలో 9 ఇప్పటికే ఓపెన్ చేయగా, 15 స్క్రీన్లు అనుమతి కోసం ఉన్నాయి. మరో 152 స్క్రీన్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.
అయితే గత ఏడాదిగా విడుదల చేసిన పలు హిందీ, ఇంగ్లష్ సినిమాలు.. బాక్సాఫీస్ దగ్గర అనుకున్నట్లుగా కలెక్షన్లు రాబట్టలేకపోవడంతో పరిస్థితి తారుమారైంది. సంస్థ తీవ్ర నష్టాల్లోకి జారిపోయింది. ఇక థియేటర్లు మూసివేయడం తప్ప మరో మార్గం లేదని పీవీఆర్ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.