»Studies Found These Drugs Increase Risk Of Dementia
Health Tips: ఆ మందులు వాడే వారిలో డిమెన్షియా ముప్పు..!
వయసు మళ్లి తర్వాత మనం చాలా విషయాలు మర్చిపోతూ ఉంటాం. ఇక ముసలితన వచ్చింది అంటే మతి మరుపు కచ్చితంగా వచ్చేస్తోంది. చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు. అయోమయానికి గురౌతూ ఉంటారు. దీనినే మతిమరుపు లేదంటే డిమెన్షియా అంటారు. ఇది అందరిలోనూ జరిగేదే.
సహజంగా వచ్చే మతిమరుపు కాకుండా, కొన్ని రకాల మందుల కారణంగా కూడా ఈ మతిమరుపు వచ్చేస్తోందట. ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. దాని ప్రకారం రెండు రకాల మందులు మతిమరుపు పెరగడానికి కారణమౌతోందట. వృద్ధులు మాత్రమే కాదు, యువకుల్లోనూ ఈ సమస్య వస్తోందట. బెంజోడయాజెపైన్, యాంటీకోలినెర్జిక్స్ ఔషధాలకు డిమెన్షియాకు సంబంధం ఉందని ఆ అధ్యయనాల్లో తెలిపారు. ఈ మేరకు హార్వర్డ్ హెల్త్ పబ్లిషింగ్ వెబ్ సైట్ లో వెల్లడించారు.
ఎక్కువకాలం పాటు ఈ మందులు వాడిన వారిలో మతిమరుపు బారినపడే అవకాశాలు అధికం అని పరిశోధకులు గుర్తించారు. ఈ రెండు ఔషధాలు మెదడు కార్యకలాపాలకు తోడ్పడే న్యూరో ట్రాన్స్ మిటర్లపై ప్రభావం చూపుతున్నట్టు గమనించారు. బెంజోడయాజెపైన్ మెదడులోని న్యూరాన్లను మందకొడిగా మార్చేస్తున్నట్టు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మంది డిమెన్షియాతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు, డిమెన్షియా ప్రాణాంతకం కూడా. ప్రపంచంలో అత్యధిక మరణాలకు దారితీస్తున్న ఆరోగ్య సమస్యల్లో డిమెన్షియా ఏడోస్థానంలో ఉంది.