రువాండా(Rwanda)లో వర్షాలు(rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ, ఉత్తర రువాండాలో పెద్ద ఎత్తున వరదలు(floods) సంభవించాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలకు ఎక్కువగా నీరు చేరడం, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 130 మందికిపైగా మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రువాండా మీడియా వెల్లడించింది.
మంగళవారం రాత్రి, బుధవారం ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతోపాటు మరి కొంత మంది బాధితుల కోసం రెస్క్యూ సిబ్బంది(rescue officers) వెతుకుతున్నారని రువాండాలోని పశ్చిమ ప్రావిన్స్ గవర్నర్ ఫ్రాంకోయిస్ తెలిపారు.
అయితే గతవారం మొదలైన ఈ వర్షాల కారణంగా ఇప్పటికే రువాండా(Rwanda)లో అనేక ఇళ్ళు కొట్టుకుపోయాయని, మరికొన్ని చోట్ల రోడ్లు కూడా అందుబాటులో లేకుండా పోయాయని వెల్లడించారు. మరోవైపు ఈ దేశానికి ఇంకా వర్షాలు కురుస్తాయని రువాండా వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
చిత్తడి నేలలు, ఇతర ప్రమాదకరమైన ప్రాంతాలలో నివసించే నివాసితులు తరలివెళ్లాలని ప్రభుత్వం గతంలోనే కోరిందని అధికారులు చెబుతున్నారు. ఉగాండా నైరుతితో సహా తూర్పు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం(heavy rain) నమోదైంది.