»Disinvestment Process Is Under Progress Of Vizag Steel Plant Says Union Ministry Of Steel
‘అదంతా తూచ్.. Vizag Steel Plantను అమ్మేస్తాం’.. కేంద్రం మరో ప్రకటన
సంస్థకు అవసరమైన మూలధన సమీకరణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం, అత్యుత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు అదే చేస్తోంది.
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant)పై కేంద్ర ప్రభుత్వం (Govt of India) ఆటలాడుకుంటోంది. ప్రైవేటీకరణపై (Privatisation) మీనమేషాలు వేస్తోంది. మొన్న కేంద్ర మంత్రి ప్రైవేటీకరణ ఇప్పట్లో చేయలేమని, దాని ప్రక్రియ ఆగిపోయిందని ప్రకటించగా.. తాజాగా కేంద్ర ప్రభుత్వం తూచ్.. అదేమీ లేదు. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని ప్రకటించింది. ఇలా రోజుకో ప్రకటన చేస్తూ కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ తో ఆడుకుంటోంది. మొన్న కేంద్ర ఉక్కు మంత్రి ఫగ్గన్ సింగ్ (Faggan Singh Kulaste) చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ (Union Ministry of Steel) స్పష్టం చేసింది. పెట్టుబడుల ఉపసంహరణకు ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేవని ప్రకటించింది.
‘ఆర్ఐఎన్ఎల్ (Rashtriya Ispat Nigam Limited-RINL)లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకు ఎలాంటి అడ్డంకులు లేవు. పెట్టుబడుల ఉపసంహరణను నిలుపుదల చేసినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో మంత్రిత్వ శాఖ స్పష్టత ఇస్తోంది. ప్రస్తుతం ఈ ప్రక్రియ పురోగతిలో ఉంది. ఆర్ఐఎన్ఎల్ పనితీరును మెరుగుపరిచి, దాన్ని నిలబెట్టడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తోంది’ అని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
విశాఖ ఉక్కు కర్మాగారంలో (Visakhapatnam Steel Plant-VSP) కేంద్ర ప్రభుత్వం తనకు ఉన్న వాటాలను 100 శాతం ఉపసంహరించుకోనుంది. పెట్టుబడుల ఉపసంహరణకు 27 జనవరి 2021న కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ వాటాలను ప్రైవేటుకు విక్రయించాలని తీర్మానించింది. సంస్థకు అవసరమైన మూలధన సమీకరణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం, అత్యుత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు చెబుతోంది. అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమలో కూడా పెట్టుబడులు ఉపసంహరించుకోనుంది.