ఓ ఎలుక పట్ల క్రూరంగా ప్రవర్తించి, దానిని చంపేసిన ఓ వ్యక్తి పైన ఉత్తర ప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసి, ఛార్జీషీటు దాఖలు చేశారు. గత ఏడాది మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఓ ఎలుక తోకకు రాయి కట్టి మురుగు కాల్వలోకి విసిరేశాడు. దీనిని జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర చూశాడు. జంతువు పట్ల క్రూరంగా వ్యవహరించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఎలుకను బయటకు తీసి తాను కాపాడే ప్రయత్నం చేశానని, కానీ ఆ లోపు చనిపోయిందని చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు మనోజ్ పైన ఐపీసీ సెక్షన్ 429, జంతు హింస నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఎలుక కళేబరాన్ని శవ పరీక్ష నిమిత్తం వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిరాకరించడంతో బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు తీసుకు వెళ్లారు. పరీక్షల అనంతరం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అది చనిపోయినట్లు తేల్చారు. దీంతో పోలీసులు న్యాయస్థానంలో 30 పేజీల ఛార్జీషీట్ ను దాఖలు చేశారు. ఈ ఘటన నవంబర్ లో జరిగింది.
ఎలుకలు అంటే చాలా మందికి చిన్న చూపు ఉండవచ్చునని, కానీ దానిని చంపిన విధానం జంతువులపై క్రూరత్వం కిందకు వస్తుందని, అందుకే తాను కేసు పెట్టానని, భవిష్యత్తులో మరే ఇతర జంతువుపై కూడా ఇదే విధంగా మరొకరు వ్యవహరించకుండా ఉంటుందని ఫిర్యాదుదారు వికేంద్ర చెప్పారు.
మరోవైపు, మనోజ్ తండ్రి మథుర ప్రసాద్ మాట్లాడుతూ… ఎలుకలను, కాకులను చంపడం అంత తప్పేమీ కాదన్నారు. ఇవి హానికరమైన జంతువులు అని చెప్పారు. తమ ఇంట్లో మట్టితో తయారు చేసిన పాత్రలను ఎలుకలు పాడు చేశాయని, మట్టి దిబ్బలుగా మార్చేశాయని, దీంతో మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పడిన తన కొడుకు వాటిని చంపేశాడని చెప్పారు. ఎలుకను చంపితే చర్యలు తీసుకున్నప్పుడు మేకలు, కోళ్లు, కోడి గుడ్లను చంపే కబళాలపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. చేపలు, ఎలుకలను చంపే రసాయనాలను విక్రయించే వారి పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.